మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు కరోనా పాజిటివ్ అన్న వార్తలను అతని సోదరుడు అనీస్ ఇబ్రహీం ఖండించాడు. దావూద్‌తో పాటు అతని భార్యకు కరోనా సోకిందని, కరాచిలోని ఓ సైనిక ఆసుపత్రిలో చేరినట్లు నిఘా వర్గాలు నివేదించాయి. అతని సహాయకులు, భద్రతా సిబ్బంది క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపాయి.
అయితే ఈ వార్తలు అవాస్తమని దావూద్ డీ-కంపెనీ అండర్‌వరల్డ్ కార్యాకలాపాలను నిర్వహించే అనీస్ స్పష్టం చేశాడు. ఓ ఆంగ్ల వార్తా సంస్థతో ఫోన్లో మాట్లాడిన అనీస్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇదే సమయంలో యూఏఈతోపాటు పాకిస్థాన్‌లో వ్యాపారాన్ని నడుపుతున్నట్లు అంగీకరించాడు.
"భాయ్ (దావూద్) క్షేమంగా ఉన్నాడు. షకీల్ కూడా బాగానే ఉన్నాడు. ఎవరికీ కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలలేదు. కుటుంబంలో ఎవరూ ఆసుపత్రిలో చేరలేదు."
- ఫోన్లో అనీస్
డీ- కంపెనీకి చెందిన కీలక వ్యక్తి, షార్ప్ షూటర్ చోటా షకీల్ కూడా కరాచిలోనే ఉన్నాడు. అయితే అనీస్ ఎక్కడినుంచి మాట్లాడుతున్నాడో మాత్రం చెప్పేందుకు నిరాకరించాడు.
కరాచిలోనే దావూద్..
దావూద్ ఇబ్రహీం కస్కడ్ అనేక తీవ్ర కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. 1993 ముంబయి వరుస పేలుళ్లలో కీలక సూత్రధారిగా వ్యవహరించాడు. అయితే దావూద్‌తో పాటు అతని కుటుంబాన్ని పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఆశ్రయం ఇచ్చి కరాచిలో దాచిపెట్టినట్టు భారత్ ఆరోపిస్తోంది. అయితే పాక్ మాత్రం వీటిని కొన్నేళ్లుగా ఖండిస్తోంది.
దావూద్ కుటుంబం 1994 నుంచి కరాచీలోనే ఉంటోంది. దావూద్ కుమార్తె మారుఖ్ను పాక్ ప్రముఖ క్రికెటర్ జావేద్ మియాందాద్ కుమారుడికి ఇచ్చి వివాహం చేశాడు.
సంజయ్ వివాదం నుంచి..
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నివాసం ఎదుట 1990లో ఆయుధాలతో నిండిన వాహనాన్ని పార్క్ చేసినప్పటి నుంచి అనీస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దుబాయ్ వేదికగా బాలీవుడ్ చిత్రాలకు నిధులు సమకూర్చినట్లు, క్రికెట్ బెట్టింగ్‌లు.. ఇలా అతనిపై చాలా కేసులు ఉన్నాయి. భారత ఏజెన్సీల నుంచి తప్పించుకునేందుకు కొన్నేళ్ల కింద సౌదీ అరేబియాలో నిర్బంధంలో ఉన్నట్లు సమాచారం.
పాక్ కేంద్రంగా వ్యాపారాలు..
డీ-కంపెనీ కార్యకలాపాలు కరాచీ నుంచే జరుగుతున్నట్లు ఐరాసతోపాటు ఇంటర్‌పోల్‌కు భారత్ నివేదించింది. కరాచీ విమానాశ్రయం నుంచి అఫ్గానిస్థాన్‌కు రవాణా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందించింది. ఇందులో పనిచేసే వ్యక్తులు హెరాయిన్ వంటి మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నట్లు ఆరోపించింది.
కొన్నేళ్లకు దావూద్, అతని సోదరుడు పాకిస్థాన్, యూఏఈలోని హోటల్, రిసార్ట్ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు. సింధ్ రాష్ట్రంలో దావూద్‌కు షాపింగ్ మాల్స్ ఉన్నాయి. పాక్‌లోని హైదరాబాద్ సమీపంలో ఉన్న కొట్రి కాగితపు కర్మాగారం దావూద్‌దేనని తెలుస్తోంది.