భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) జాతీయ కౌన్సిల్ ముగింపు సమావేశంలో భాగంగా నూతన జాతీయ ప్రధాన కార్యదర్శిగా డి.రాజా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు బాధ్యతలు నిర్వర్తించిన సురవరం సుధాకర్ రెడ్డి అనారోగ్య కారణాలతో పదవికి రాజీనామా చేశారు. సీపీఐ జాతీయ కౌన్సిల్ సమావేశంలో భాగంగా రాజా నియామకంపై నిర్ణయం తీసుకుంది పార్టీ అధిష్ఠానం. ఆయన పేరును పార్టీ సిఫార్సు చేయగా సభ్యులందరూ ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు.
పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు రాజా.
"ప్రస్తుత క్లిష్టపరిస్థితుల్లో పార్టీని నడిపించాలని నాపై ఇంత పెద్ద బాధ్యతను ఉంచినందుకు పార్టీ కామ్రేడ్ సుధాకర్‌రెడ్డి, పార్టీ జాతీయ కౌన్సిల్‌కు నా కృతజ్ఞతలు. సీపీఐ, లెఫ్ట్ పార్టీలు ఈ ప్రభుత్వంపైనా, ప్రభుత్వ హానికర విధానాలపైనా రాజీ లేని పోరాటం చేస్తూనే ఉంటాయి. ప్రజల ప్రజాస్వామ్య, రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. దేశంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయం కోసం మా పోరాటం కొనసాగుతుంది."
- డి.రాజా, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి.
ప్రస్తుతం తమిళనాడు నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు రాజా. సుదీర్ఘకాలం పాటు పార్టీ జాతీయ నేతగా సేవలందించారు. ఎస్సీల సమస్యలపై అనేక పోరాటాలు చేశారు.
ఇదీ చూడండి: బ్యాలెట్ పేపర్లు తిరిగి తీసుకురావాలి: మమత