గుజరాత్ వాసుల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తూ 'వాయు' తుపాను గంటగంటకూ మరింత తీవ్రమవుతోంది. తీరప్రాంతంలోని 10 జిల్లాల్లో తుపాను ప్రభావం 24 గంటలపాటు ఉంటుందని అధికారులు తెలిపారు. గంటకు 170 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రకటించారు. పోరుబందర్, దమన్ దీవ్ మధ్య తీరప్రాంతాన్ని గురువారం ఉదయం తాకనుంది 'వాయు' తుపాను.
అప్రమత్తమైన కేంద్రం
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మరింత అప్రమత్తమైంది. ఇప్పటికే 52 జాతీయ విపత్తు స్పందన దళాలను రాష్ట్రానికి పంపింది. ఒక్కో బృందంలో 45 మంది సిబ్బంది ఉంటారు. సహాయక చర్యల కోసం 10 కంపెనీల భారత సైన్యాన్ని మోహరించింది. నౌకా దళానికి చెందిన యుద్ధనౌకలు, విమానాలను సన్నద్ధం చేసింది.
హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలోని జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ (ఎన్సీఎంసీ) సమావేశమైది. ముందు జాగ్రత్తలు, సహాయక చర్యలు తదితర అంశాలపై అధికారులు చర్చించారు. ఒక్క ప్రాణానికి హాని కలగకుండా చర్యలు తీసుకోవాలని రాజీవ్ అధికారులను ఆదేశించారు.
సురక్షిత ప్రాంతాలకు తరలింపు
తుపాను ప్రభావం ఉండే సౌరాష్ట్ర, కచ్ ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించింది గుజరాత్ ప్రభుత్వం. సుమారు 3 లక్షల మంది ప్రజలను తీరప్రాంతాల నుంచి ఖాళీ చేయించింది. ముందు జాగ్రత్తగా నౌకాశ్రయాలు, విమానాశ్రయాలను మూసివేసింది. 10 జిల్లాల్లోని విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవు ప్రకటించింది.
ఇదీ చూడండి: 24 గంటల్లో తీరం దాటనున్న 'వాయు' తుపాను