దేశ ప్రజలను ఫొని తుపాను భయభ్రాంతులకు గురిచేస్తోంది. మరో 6 గంటల్లో తీవ్ర తుపానుగా మారనున్న 'ఫొని' పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రధాని. ఉన్నతాధికారులతో సమీక్షించిన మోదీ.. విపత్తును ధైర్యంగా ఎదుర్కోవడంపై దిశానిర్దేశం చేశారు.
అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు తెలిపినట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు ప్రధాని.
''ఫొని తుపాను పరిస్థితిపై అధికారులతో మాట్లాడాను. ముందస్తు నివారణ చర్యలు, అవసరమైన సాయాన్ని అందించాలని సూచించాను. తుపాను ప్రభావిత రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలని అధికారుల్ని ఆదేశించా. ప్రతి ఒక్కరి క్షేమం కోసం ప్రార్థించండి.''
- ప్రధాని మోదీ ట్వీట్
క్రమక్రమంగా బలపడుతున్న 'ఫొని' రాబోయే 24 గంటల్లో పెను తుపానుగా మారనుందని వాతవరణ శాఖ తెలిపింది. మరో 3 గంటల్లో తీవ్ర తుపాను స్థాయికి చేరుతుంది.
దేశంలోని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లతో పాటు.. మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది.