కేరళలో సంచలనం సృష్టించిన వరుస హత్యల కేసులో ప్రధాన నిందితురాలు జాలీ.. హత్యోదంతాలపై పూర్తి వివరాలను పోలీసులకు వివరించింది. కుటుంబ సభ్యుల్లో ఎవరెవరికి ఏ విధంగా విషమిచ్చి చంపిందో తెలిపింది.
రాయ్ థామస్, అతని మామయ్య మాథ్యూ మంచడియిల్కు మద్యంలో సైనైడ్ కలిపి ఇచ్చినట్లు వెల్లడించింది. విటమిన్ మాత్రల్లో విషం కలిపి టామ్ థామస్, సిలీను హత్య చేసినట్లు తెలిపింది. అన్నమ్మను చంపేందుకు పురుగుల మందు ఉపయోగించానంది. సిలీ కూతురు అల్ఫైన్ హత్యకు సంబంధించి సరైన వివరాలు తెలపలేదని పోలీసులు చెప్పారు.
కెమెరాల సమక్షంలో..
సరైన విచారణ అధికారులు లేని కారణంగా రెండు కెమెరాలను ఉపయోగించి జాలీ వాంగ్మూలాన్ని రికార్డు చేశారు పోలీసులు. వీటిని నిర్ధరించేందుకు శాస్త్రీయ పద్ధతిని ఉపయోగించనున్నట్లు తెలిపారు. ఇందుకు వారిని పూడ్చి పెట్టిన మట్టిలో విషం ఆనవాళ్లను గుర్తించాల్సి ఉందన్నారు.
ముమ్మరంగా విచారణ
ఏడు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించిన తర్వాత జాలీతో పాటు మరో ఇద్దరు నిందితులు మాథ్యూ, ప్రాజికుమార్ను విచారిస్తున్నారు అధికారులు. ఇందుకోసం వారిని మొదటి 3 హత్యలు జరిగిన పొన్నమట్టం ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడ జాలీ చెప్పినదాని ప్రకారం కొన్ని ఆధారాలను సేకరించారు.
ఆ ఇంట్లో నుంచి పురుగుల మందు సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడే వాటిని పరీక్షించేలా ఫోరెన్సిక్ బృందాన్ని కూడా వెంట తీసుకెళ్లారు. తర్వాత సిలీ మరణించిన పంటి దవాఖానాతో పాటు ఎన్ఐటీ ప్రాంగణానికి తీసుకెళ్లి విచారణ చేపట్టారు. ఇక్కడితో మొదటి దశ విచారణ పూర్తయినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: సైనైడ్ 'జాలీ'కి 7 రోజులు పోలీస్ కస్టడీ