రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాజీనామా సమర్పించి చాలా కాలం గడుస్తున్నా... నూతన సారథిపై పార్టీ ఇంకా ఎటూ తేల్చలేదు. నేడు సుదీర్ఘంగా జరిగిన సీడబ్ల్యూసీ భేటీలో ఈ విషయంపై ఓ నిర్ణయం వస్తుందని అంతా ఊహించారు. అయితే ఈ భేటీలో స్పష్టత రాలేదు. రాత్రి 8.30 గంటలకు సీడబ్ల్యూసీ మరోమారు సమావేశం కానుంది. కొత్త అధ్యక్షుడిపై నేడు ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
మరోసారి విజ్ఞప్తి...
కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగాలని సీడబ్ల్యూసీ మరోసారి చేసిన విజ్ఞప్తిని రాహుల్ గాంధీ తోసిపుచ్చినట్లు పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా తెలిపారు. రాజ్యాంగ సంస్థలపై ప్రభుత్వం దాడి చేస్తున్న ఈ తరుణంలో రాహుల్ నాయకత్వం కావాలని సీడబ్ల్యూసీ కోరగా.. రాహుల్ తిరస్కరించారట. శ్రేణులతో కలిసి పోరాటం చేయడానికి రాహుల్ సుముఖత చూపినట్లు సుర్జేవాలా తెలిపారు.
రాహుల్ రాజీనామా సీడబ్ల్యూసీ పరిశీలనలోనే ఉందని సుర్జేవాలా స్పష్టం చేశారు. ఈ విషయంపై సాయంత్రానికి సీడబ్ల్యూసీ ఓ నిర్ణయం తీసుకుంటుందన్నారు.
5 బృందాలు ఏర్పాటు...
కాంగ్రెస్ అధ్యక్షుణ్ని ఎంపిక చేసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ నేతల అభిప్రాయం తీసుకోవాలని సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం సీడబ్ల్యూసీ సభ్యులతో ఐదు బృందాలను ఏర్పాటు చేసింది. రాహుల్‌గాంధీ వారసుణ్ని ఎంపిక చేసేందుకు ఇవాళ దిల్లీలో ప్రత్యేకంగా సమావేశమైన సీడబ్ల్యూసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
అన్నిరాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, పార్టీ అనుబంధాన సంఘాల ప్రతినిధుల అభిప్రాయం తీసుకునేందుకు 5 బృందాలను ఏర్పాటు చేశారు.
రేసులో...
కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో సీనియర్ నేతలు ముకుల్ వాస్నిక్, మల్లికార్జున ఖర్గే పేర్లు ఉన్నట్లు సమాచారం. యువనేతల్లో జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలెట్ పేర్లు వినిపిస్తున్నాయి.