తమిళనాడు సేథాంకుడికి చెందిన వివేకానందకు జంతువులపై అపారమైన ప్రేమ. ఓ రోజు వీధిలో తిరుగుతున్న ఓ శునకాన్ని చూసి చేరదీశాడు. అప్పటినుంచి అతనికి నమ్మకంగా ఉంటూ వస్తుంది. దానిని ముద్దుగా 'చిను' అని పిలుచుకుంటాడు వివేకానంద.
చిను ప్రత్యేకత ఏంటంటే యజమానికి ప్రతి పనిలో సహాయంగా నిలుస్తోంది. అతిథుల్ని ఇంట్లోకి ఆహ్వానించడం, విషసర్పాల నుంచి చుట్టుపక్కల వారికి రక్షణగా నిలవడం వంటివి చేస్తూ మిగతా వాటికి భిన్నంగా నిలుస్తోంది.
అంతేకాదండోయ్.. ప్రతి రోజూ కిరాణా షాపుకు వెళ్లి కూరగాయలు, ఇతర సామగ్రీ తీసుకొస్తుంది. అవసరమైన వస్తువుల జాబితాను చీటీలో రాసి వివేకానంద బాస్కెట్లో వేస్తే.. నోట కరుచుకుని వెళ్లి సామాన్లు తెస్తుంది చిను. అందుకే ఈ శునకం అంటే వివేకానందకే కాదు.. ఊళ్లోని వారందరికీ అమితమైన ఇష్టం.
లఘుచిత్రంలో నటనకు అవార్డు...
మరొక విషయమేంటంటే 'చిను' ఓ లఘు చిత్రంలోనూ నటించింది. ఆ సినిమా పేరు వెలిచామ్. ఇందులో అంధుడైన తన యజమానికి ... సహాయకురాలి పాత్రలో జీవించింది. ఈ చిత్రానికి అవార్డులూ వచ్చాయి.
ఈ ఇండీ జాతికి చెందిన కుక్కలను పోలీసు, సైన్యం వంటి విధుల్లో చేర్పించాలని కోరుకుంటున్నాడు వివేకానంద. తననడిగితే.. చినును సైన్యానికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. చినుకు మాట్లాడటం ఒక్కటి తప్ప.. మనుషుల మాదిరే భావోద్వేగాలు, ప్రేమ, తెలివితేటలు అన్నీ ఉన్నాయని అంటున్నాడీ జంతుప్రేమికుడు.