రెండు వేర్వేరు చోట్ల ప్రమాదకర మూగజీవాలు జనావాస ప్రాంతాల్లోకి వచ్చాయి. అనంతరం.. వాటిని అటవీ అధికారులు పట్టుకున్నారు. అయితే జనసందోహం కారణంగా.. ఒక జీవి ప్రాణాలు కోల్పోయింది.
కేరళలోని త్రిస్సూర్‌లో ఓ మొసలి.. షాజన్ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించింది. గమనించిన యజమాని.. అటవీ అధికారులకు సమాచారం ఇవ్వగా సమయానికి వారు వచ్చి పట్టుకున్నారు. అనంతరం.. దానిని సమీపంలోని అథిరాపల్లీ నదిలో వదిలారు.
జనాన్ని హడలెత్తించిన అడవి దున్న..
మహారాష్ట్ర పుణెలో ఓ అడవి దున్న.. జనాన్ని భయభ్రాంతులకు గురిచేసింది. కోథ్రూడ్ గ్రామంలోని మహాత్మా కాలనీలో అడవి దున్న ప్రత్యక్షమైంది. కాసేపు అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రమాదకర జంతువుకు భయపడి ప్రజలు పరుగులు తీశారు.
కొందరు స్థానికులు అటవీ శాఖకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది.. ఉచ్చు వేసి దాన్ని బంధించారు. అయితే.. జనం భారీగా గుమికూడగా ఆ ఒత్తిడితో భయాందోళనకు గురైన అడవి దున్న కాసేపటికే మరణించింది. సరైన కారణం ఏంటో అధికారులు స్పష్టత ఇవ్వలేదు.