పుణెకు చెందిన ఓ రెస్టారెంట్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు వినూత్న పోటీ నిర్వహిస్తోంది. తమ హోటల్లో నాలుగు కేజీల థాలీ తింటే రూ.1.65 లక్షలు విలువ చేసే రాయల్ ఎన్ఫీల్డ్ బండిని బహుమతిగా ఇస్తామని ప్రకటించింది. అయితే ఆ థాలీ తీరిగ్గా తింటాం అంటే కుదరదు. సరిగ్గా గంటలో పూర్తి చేయాలి.
నగర శివార్లలో ఉండే శివ్‌రాజ్ హోటల్ కస్టమర్లకు 'బుల్లెట్ థాలీ' పేరుతో ఈ సవాల్ విసిరింది. మొత్తంగా 4 బైకులను బహుమతులుగా ఇచ్చేందుకు సిద్ధమైంది.
![pune, bullet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/mh-pun-01-special-story-thali-mh10024_21012021010403_2101f_1611171243_158.jpg)
![pune, bullet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/mh-pun-01-special-story-thali-mh10024_21012021010403_2101f_1611171243_841.jpg)
12 రకాల వంటలతో..
నోరూరించే పన్నెండు రకాల మాంసాహార వంటకాలను పోటీదారులు ఆరగించాలి. నాలుగు కేజీల మటన్, చేపలు, చికెన్‌తో తయారయ్యే ఈ వంటకాలను వండేందుకు 55 మంది సిబ్బంది శ్రమిస్తారు. థాలీలో భాగంగా ఫ్రైడ్ సుర్మాయ్, పొమ్ఫ్రెట్ ఫ్రైడ్ ఫిష్, చికెన్ తందూరీ, డ్రై మటన్, గ్రే మటన్, చికెన్ మసాలా, రొయ్య బిర్యానీ వడ్డిస్తారు. ఈ ఒక్కో థాలీ ధర రూ.2,500.
![pune, bullet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/mh-pun-01-special-story-thali-mh10024_21012021010403_2101f_1611171243_570.jpg)
భారీ స్పందన..
ఇప్పటికే స్పెషల్ రావణ్ థాలీ, మాల్వానీ ఫిష్ థాలీ, పహిల్వాన్ మటన్ థాలీ, బకాసుర్ చికెన్ థాలీ, సర్కార్ మటన్ థాలీ వంటి భారీ థాలీలతో భోజన ప్రియులకు సవాళ్లు విసిరింది ఆ రెస్టారెంట్. తాము చేపట్టిన వినూత్న పోటీలకు భారీ స్పందన వస్తోందని హోటల్ యజమాని అతుల్ వాయికర్ తెలిపారు. రోజుకు దాదాపు 65 థాలీలు అమ్ముడుపోతున్నాయని చెప్పారు. కరోనా దృష్ట్యా భూతిక దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : తామరాకు తరహాలో నీటిని వికర్షించే ఉపరితలం!