కేరళ వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గంలో రాహుల్‌గాంధీ పోటీ చేస్తే ఆయన్ను ఓడించి తీరతామని సీపీఎం తేల్చిచెప్పింది. కాంగ్రెస్ నిర్ణయాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ తప్పుబట్టారు. వామపక్ష అభ్యర్థిపై కాకుండా భాజపా పోటీ చేస్తున్న స్థానం నుంచి రాహుల్ బరిలోకి దిగాల్సిందని అభిప్రాయపడ్డారు. రాహుల్ పోటీ చేస్తున్నంత మాత్రాన వయనాడ్ ప్రత్యేకమేమీ కాదని, రాష్ట్రంలోని 20 లోక్‌సభ స్థానాల్లానే పరిగణిస్తామని స్పష్టం చేశారు విజయన్.
రాహుల్ నిర్ణయంపై సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారాట్ అభ్యంతరం వ్యక్తంచేశారు.
"వయనాడ్ నుంచి రాహుల్‌గాంధీ లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగాలన్న కాంగ్రెస్ పార్టీ నిర్ణయంతో... కేరళలో వామపక్షాలపై పోటీచేయాలన్నదే వారి ప్రస్తుత ప్రాధాన్యాంశంగా కనిపిస్తోంది. ఈ నిర్ణయం భాజపాకు వ్యతిరేకంగా పోరాడాలన్న కాంగ్రెస్ జాతీయ నిబద్ధతకు విరుద్ధం. ఎందుకంటే కేరళలో భాజపాపై ప్రధానంగా పోరాడుతోంది వామపక్ష కూటమే. కానీ రాహుల్‌గాంధీ లాంటి అభ్యర్థిని వామపక్ష కూటమిపై పోటీకి దింపడం... కాంగ్రెస్‌పార్టీ కేరళలో వామపక్షాలను లక్ష్యంగా చేసుకోవడమే."
- ప్రకాశ్ కారాట్, సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి
జాతీయస్థాయిలో కాంగ్రెస్, వామపక్షాలు మహాకూటమిలో భాగస్వాములు. కేరళలో మాత్రం సీపీఎం అభ్యర్థిపై రాహుల్‌కు సిద్ధమవడం చర్చనీయాంశమైంది.
బంగాల్‌లోనూ ఇలాంటి పరిస్థితే. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ మిత్రపక్షాలైనా... బంగాల్లో మాత్రం ప్రత్యర్థులు.