పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే ఎంపీలు తప్పనిసరిగా వారి వ్యక్తిగత, కుటుంబ సభ్యులు, సన్నిహితుల కొవిడ్-19 నెగిటివ్ రిపోర్ట్ చూపాల్సి ఉంటుందని పేర్కొన్నాయి ఉభయ సభల సచివాలయాలు. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేశాయి. ఎంపీల సన్నిహితుల జాబితాలో పీఏ, పీఎస్, డ్రైవర్, పనిమనుషులను చేర్చాయి.
మార్గదర్శకాలు..
- సమావేశాల ప్రారంభానికి 72 గంటల ముందే ఎంపీలు కరోనా పరీక్షలు చేయించుకోవాలి.
- సొంత నియోజకవర్గంలోనైనా లేదా పార్లమెంటు ఆవరణలోనైనా పరీక్షలు చేయించుకోవచ్చు.
- కొవిడ్ పరీక్షల్లో నెగిటివ్‌గా వస్తే నిరభ్యంతరంగా సమావేశాలకు హాజరుకావచ్చు.
- పరీక్షల్లో పాజిటివ్‌గా తేలితే వైద్యుల సూచన మేరకు ఐసోలేషన్‌కు వెల్లటం లేదా ఆస్పత్రిలో చేరాలి.
- ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎంపీల కుటుంబ సభ్యులు, సిబ్బంది కూడా పరీక్షలు చేసుకోవాలి.
- కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సిబ్బందిలో ఎవరికైనా పాజిటివ్‌గా తేలితే.. సదరు పార్లమెంట్ సభ్యుడు 14 రోజుల హోం క్వారంటైన్‌కు వెళ్లాలి.
- పార్లమెంట్ సమావేశాల సమయాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. ఆరు అడుగుల మేర భౌతిక దూరం పాటించాలి. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలి.
- ఎంపీలతో పాటు లోక్‌సభ, రాజ్యసభ సచివాలయ సిబ్బంది కూడా కొవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలి.
కరోనా నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలకు వేల సంఖ్యలో మాస్కులు, చేతి గ్లౌజులు, వందల కొద్ది శానిటైజర్ బాటిళ్లు, ఫేస్ సీల్డ్లు అందుబాటులో ఉంచారు. స్వయంచాలితంగా తెరుచుకునే డోర్లు, చేతులు తగలకుండా పనిచేసే శానిటైజర్లు, థర్మల్ స్క్రీనింగ్ వంటి ఏర్పాట్లు చేశారు. ఎంపీలు, సిబ్బందితో పాటు సుమారు 4000 మందికి కరోనా పరీక్షలు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేశారు.
కరోనా కారణంగా తొలిసారి లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలు వేరువేరు సమయాల్లో నిర్వహిస్తున్నారు. సురక్షితంమైన సమావేశాల కోసం ఇప్పటికే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర హోంశాఖ, ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్, డీఆర్డీఓ అధికారులతో చర్చిస్తున్నారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 14న ప్రారంభమై అక్టోబర్ 1న ముగియనున్నాయి.
ఇదీ చూడండి: లోక్‌సభలో వ్యవసాయదారులే అధికం... తెలంగాణ నుంచి ఆరుగురు