కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రస్తుతం ప్రజలు స్వచ్ఛందంగా నిర్బంధంలో ఉన్నారని, అత్యయిక స్థితి సమయంలో అలా లేదని, అన్యాయంగా ప్రజలను నిర్బంధించారని భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు 1975లో కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన అత్యయిక స్థితికి గురువారంతో 45 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉపరాష్ట్రపతి ఫేస్‌బుక్‌లో సుదీర్ఘమైన పోస్టు పెట్టారు. "హక్కులే లేనప్పుడు ఆ జీవితానికి విలువ ఏముంటుంది" అంటూ అత్యయిక స్థితి రోజుల్లో నిర్బంధాన్ని వివరించారు.
"ప్రస్తుత నిర్బంధానికి కరోనా వైరస్ కారణం. నేను మాటాడుతున్న నిర్బంధానికి కారణాలు వేరు. అది ప్రజా జీవితంలోని నాయకుల అడ్డూ అదుపు లేని అవినీతి వల్ల వచ్చింది. ప్రజల్లో పెల్లుబికుతున్న తీవ్ర అసంతృప్తిని అణచివేయడానికి వచ్చింది. అందరి బాగు కోసం ఇప్పుడు మనం మాస్కులు ధరిస్తున్నాం. సామాజిక దూరం పాటిస్తున్నాం. నిర్బంధం అంటే ఏమిటో ఈ కొద్ది సమయంలో తెలుసుకున్నాం. ఇది న్యాయమైంది. 45 ఏళ్ల నాటి సంగతి వేరు. దేశభద్రతకు ముప్పు, అంతర్గత గొడవల పేరుతో కావాలని కుట్రపూరితంగా మోపిన నిర్బంధం" అని వెంకయ్య నాయుడు చెప్పుకొచ్చారు. ఆ 21 నెలల కాలంలో ప్రజలు జీవించే హక్కుతో పాటు.. అన్ని ప్రాథమిక హక్కులు కోల్పోయారని పేర్కొన్నారు.
"భిన్నాభిప్రాయాన్ని సహించలేని రోజులవి. అభద్రతా భావం పెరుగుతున్న దశ. రాజ్యాంగాన్ని మూలకు తోశారు. ప్రభుత్వ నిర్ణయాలపై న్యాయ సమీక్ష చేసే హక్కును కాలరాచారు. అంతా కటిక చీకటి" అని అనాటి రోజులను వెంకయ్య నాయుడు గుర్తు చేసుకున్నారు. అత్యయిక స్థితి కాలంలో జైల్లో తాను చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. అది ప్రస్తుత ఆన్‌లైన్ విద్యలాంటిది కాదని, వ్యక్తుల నుంచి, సమూహ చర్చల నుంచి నేర్చుకున్న పాఠాలని తెలిపారు.
ఇదీ చూడండి: సరిహద్దుల్లోకి భారీగా భారత బలగాలు