కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి భారతీయ సంస్థలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే... దేశంలో పరిశోధనలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఏడాదిలో భారీ పురోగతి సాధించే అవకాశం లేదని అంచనావేస్తున్నారు.
దేశంలోని ప్రైవేటు కంపెనీలతో పాటు ప్రభుత్వం కూడా కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు చర్యలు ప్రారంభించింది. పీఎం కేర్స్ నిధి నుంచి రూ.100 కోట్లు కేటాయించింది.
"కరోనా సంక్షోభం నివారణకు వ్యాక్సిన్ అవసరం చాలా ఉంది. భారతీయ శాస్త్రవేత్తలు, అంకుర సంస్థలు, పరిశ్రమ వర్గాలు వ్యాక్సిన్ అభివృద్ధి, రూపకల్పనకు కలిసి రావాలి. టీకా అభివృద్ధి కోసం మార్గాలను గుర్తించేందుకు బయోటెక్నాలజీ శాఖను సమన్వయ సంస్థగా పనిచేస్తుంది."
- ప్రధాని కార్యాలయం
జైడస్ కాడిలా సంస్థ రెండు వ్యాక్సిన్లను రూపొందించే పనిలో ఉందని టీహెచ్ఎస్టీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గగన్‌దీప్ కాంగ్ తెలిపారు. సీరమ్ ఇనిస్టిట్యూట్, బయోలాజికల్ ఈ, భారత్ బయోటెక్, ఇండియన్ ఇమ్యునోలాజికల్స్, మైన్‌వ్యాక్స్ కంపెనీలు కూడా వ్యాక్సిన్ అభివృద్ధికి కృషి చేస్తున్నాయి. అయితే జైడస్, సీరమ్, ఐఐఎల్, భారత్ బయోటెక్ సంస్థలనే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గుర్తించింది.
"వ్యాక్సిన్ తయారీలో భారత్ సామర్థ్యం చాలా గొప్పది. సీరమ్, భారత్ బయోటెక్, బయెలాజికల్స్ సంస్థలు అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి వ్యాక్సిన్ తయారీలో చాలా ముందున్నాయి. దేశంలో కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి తొలి దశలో ఉంది. ఈ ఏడాది చివరికల్లా జంతువులపై పరీక్షించే అవకాశం ఉంది."
- షాహిద్ జమీల్, ప్రముఖ వైరాలజిస్ట్
మన సామర్థ్యం అమోఘం..
ఆలస్యమైనా భారత్‌లోని వ్యాక్సిన్ తయారీ సంస్థల సామర్థ్యం చాలా ఎక్కువనీ.. కొత్త వ్యాక్సిన్లను సృష్టించే విషయంలో కీలకంగా వ్యవహరించే అవకాశం ఉందని జమీల్ అన్నారు. ప్రస్తుతం దేశంలో కలిసి పనిచేస్తున్న కంపెనీల అనుభవం భవిష్యత్తులో సంస్థలు, పరిశ్రమలకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.
"మనం ఇప్పుడు ప్రాథమిక దశలోనే ఉన్నాం. ఏ కంపెనీ వ్యాక్సిన్ టెస్టింగ్ చేయట్లేదు. ప్రీక్లినికల్ దశకు సిద్ధమవుతున్నాయి. వ్యాక్సిన్ అభివృద్ధి కంపెనీలు వివిధ పద్ధతులను వినియోగిస్తున్నాయి. కానీ మనుషులపై ప్రయోగాలు ఇంకా జరగలేదు. అంతర్జాతీయ సంస్థలతో కలిసి భారత కంపెనీలు పనిచేస్తున్నాయి. చాలా దేశాలు మనకన్నా ముందున్నాయి."
- రాకేశ్ మిశ్రా, సీసీఎంబీ డైరెక్టర్
భారత్ వెనకబడటానికి కారణాలివే..
"భారత్‌లో వైరస్ వ్యాప్తి ఆలస్యంగా జరిగింది. రెండు, మూడు నెలలు తర్వాత వచ్చింది. వైరస్‌ను పరీక్షించేందుకు ఇన్‌యాక్టివేటెడ్ శాంపిళ్లు మన దగ్గర లేవు. చైనా, అమెరికా మాత్రం చాలా ముందున్నాయి. ఇతర దేశాలతో పోల్చి చూడాలంటే మాత్రం వెనబడ్డామనే చెప్పాలి" అని అన్నారు మిశ్రా.
వైరస్ స్ట్రెయిన్‌ను వేరు చేసిన భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్).. వ్యాక్సిన్ అభివృద్ధి కోసం భారత్ బయోటెక్‌కు అందజేసింది. వ్యాక్సిన్ తయారీ పూర్తయితే జంతువులపై ప్రయోగిస్తారు. తర్వాత మానవులపై వివిధ దశల్లో పరీక్షిస్తారు. ఇందుకు కనీసం సంవత్సరం పడుతుంది."
-ఐసీఎంఆర్ సీనియర్ అధికారి