167 ఏళ్ల రైల్వే శాఖ చరిత్రలో బుకింగ్ ద్వారా వచ్చిన ఆదాయం కంటే అధిక మొత్తంలో వినియోగదారులకు తిరిగి చెల్లించింది రైల్వేశాఖ. కరోనా సంక్షోభంలో రూ. 1,066 కోట్ల నెగిటివ్ ప్యాసింజర్ సెగ్మెంట్ ఆదాయంగా గుర్తించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించింది రైల్వేశాఖ. అదే సమయంలో సరకు రవాణా ద్వారా ఆదాయాన్ని ఆర్జించినట్లు తెలిపింది.
దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్రం ఆదేశాల మేరకు మొదటి మూడు నెలల పాటు అన్ని సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసింది రైల్వే శాఖ. దీంతో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు నగదు తిరిగి చెల్లించింది. బుక్ చేయటం ద్వారా వచ్చిన నగదు కంటే వారికి తిరిగి చెల్లించిన మొత్తం అధికంగా ఉంది అని రైల్వే శాఖ అధికార ప్రతినిధి డీజే నరేన్ తెలిపారు.
ఈ సమయంలో సరకు రవాణా కూడా అంతంత మాత్రమే ఉంది. దీంతో ఏప్రిల్‌లో రూ. 531.21 కోట్లు, మేలో రూ. 145.24 కోట్లు, జూన్‌లో 390.6 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు పేర్కొంది.
గత ఏడాది ఏప్రిల్ నెలలో రూ. 4,345 కోట్లు, మేలో రూ.4,463 కోట్లు, జూన్‌లో 4,589 కోట్లు సంపాదించినట్లు తెలిపింది రైల్వేశాఖ. ఈ ఏడాది కరోనా సంక్షోభం కారణంగా మొత్తం రూ.40 వేల కోట్లు నష్టం జరిగినట్లు వెల్లడించింది.
సరకు రవాణా ద్వారా...
సరకు రవాణా ద్వారా గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో రూ .9,331 కోట్లు, మేలో రూ .10,032 కోట్లు, జూన్‌లో రూ .9,702 కోట్లు సంపాదించగా.. ఈ ఏడాది ఏప్రిల్‌లో సరుకు ఆదాయం రూ .5,744 కోట్లు, మేలో ఇది 7,289 కోట్లు, జూన్‌లో ఈ సంఖ్య రూ .8,706 కోట్లుగా మాత్రంగా నమోదైందని పేర్కొంది.
గత రెండు వారాల నుంచి సరకు రవాణా కార్యకలాపాలు 2019 కంటే ఎక్కువగా ఉన్నాయని నరేన్ చెప్పారు. ఇది శుభపరిమాణమని అన్నారు. రైల్వే శాఖ పని తీరు వల్ల ప్యాసెంజర్ ద్వారా కోల్పోయిన నష్టాన్ని సరకు రవాణా ద్వారా భర్తి చేయగలుగుతున్నట్లు తెలిపారు.
రూ. 2 వేల కోట్లు నష్టం...
వలస కార్మికుల కోసం ఏర్పాటు చేసిన శ్రామిక్ రైళ్ల ద్వారా మే 1 నుంచి ఇప్పటి వరకు 2 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయినట్లు వెల్లడించారు.