ప్లాస్మా చికిత్స ద్వారా కొవిడ్ రోగుల్లో చాలా తక్కువ స్థాయిలోనే సత్ఫలితాలు వస్తున్నాయని తేలింది. మనదేశంలోని కొంతమంది పరిశోధకులు.. ఏప్రిల్ నుంచి జులై నెలలో నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. బ్రిటీష్ మెడికల్ జర్నల్(బీఎంజే) గురువారం ఈ నివేదికను ప్రచురించింది.
కొవిడ్ సోకడం వల్ల మధ్యస్థంగా అనారోగ్యానికి గురైన 464 మందిపై ఈ పరిశోధన చేశారు. ఇందులో పాల్గొన్నవారంతా 18 ఏళ్ల వయసు పైబడిన వారే. మొత్తం బాధితుల్లో 239 మందికి 24 గంటల వ్యవధిలో రెండు సార్లు ప్లాస్మా ద్వారా చికిత్స అందించారు. మిగతా 229 మందిని సాధారణ చికిత్స ద్వారా పర్యవేక్షించారు. నెల తర్వాత ప్లాస్మా చికిత్స తీసుకున్న 19 శాతం అంటే 44 మంది రోగులు.. తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. సాధారణ చికిత్స తీసుకున్న వారిలో 18 శాతం(41 మంది) బాధితుల పరిస్థితి విషమించింది.
ప్లాస్మా చికిత్స పొందిన బాధితులతో పోలిస్తే సాధారణ చికిత్స తీసుకున్నవారిలోనే.. ఒక శాతం తక్కువ బాధితులు ఉండటం వల్ల ప్లాస్మాతో తక్కువ ప్రయోజనాలు ఉన్నట్లు స్పష్టం చేశారు పరిశోధకులు. అయితే చాలా తక్కువ మందిపై చేసిన ఈ అధ్యయనం ద్వారా ప్లాస్మా చికిత్స ప్రయోజనాలను నిర్ధరించలేమని చెప్పారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మార్టిన్ లాండ్రీ.
ప్లాస్మా థెరపీతో కరోనా లక్షణాలు ఏడు రోజుల తర్వాత తగ్గుతున్నట్లు ఇంతకుముందు ఓ పరిశోధనలో తేలింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆయాసం వంటి సమస్యలు ఈ చికిత్సతో తగ్గుముఖం పడతాయని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ తమిళనాడు నిర్ధరించాయి.
ఇదీ చూడండి:రానున్న మూడు నెలలు కీలకం: హర్షవర్ధన్