కరోనా పరీక్షలకు సంబంధించిన వివరాలను సరళీకృతం చేసి కచ్చితమైన, తాజా సమాచారాన్ని అందుబాటులో ఉంచేందుకు ఐబీఎం కృత్రిమ మేధ సాంకేతికత వాట్సన్ అసిస్టెంట్‌ను వినయోగించనున్నట్లు తెలిపింది భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్). ఈ వర్చువల్ చాట్‌బోట్ ద్వారా ఐసీఎంఆర్ జారీ చేసిన మార్గదర్శకాల ఆధారంగా కరోనా కేసులకు సంబంధించిన పరీక్షలు, నమూనాల సేకరణ, విశ్లేషణలు, వివరాల నమోదు వేగవంతమవుతాయని వెల్లడించింది. మారిన నిబంధనలకు అనుగుణంగా ఈ చాట్‌బోట్ వివరాలకు మార్పులు చేస్తుందని పేర్కొంది.
కరోనా పరీక్షలు, రోగ నిర్ధరణ, చికిత్సపై దృష్టి సారించడం కష్టమైనందున ఈ సాధనాన్ని ఉపయోగిస్తున్నట్లు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ తెలిపారు. కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా టెస్టింగ్ కేంద్రాలను పెంచినట్లు వివరించారు. ఈ చాట్‌బోట్.. కేసుల నివేదికలను ఆటోమేటిక్‌గా అప్డేట్ చేస్తూ వేగవంతంగా వివరాలు సమకూరుస్తుందని చెప్పారు.
కరోనాపై పోరులో సాంకేతికత కీలక భూమిక పోషిస్తుందని, ఐబీఎం చాట్‌బోట్‌తో కరోనా కేసులకు సంబంధించిన వివరాలు కచ్చితత్వంతో వేగవంతంగా నమోదవతాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ అదనపు కార్యదర్శి గోపాల క్రిష్ణన్ అన్నారు. ఈ చాట్‌బోట్‌ను ఐసీఎంఆర్ అధికారిక వైబ్సైట్లో కొన్ని పేజీలకు అనుసంధానం చేసినట్లు, కరోనా నమూనాల సేకరణ, పరీక్షల నిర్వహణకు సంబంధించిన అధికారులు మాత్రమే ఈ వర్చువల్ చాట్‌బోట్‌ను వినియోగించేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.