కరోనా మహమ్మారిపై పోరును కార్మికుల హక్కులను కాలరాయడానికి, వారి గొంతును అణచివేయడానికి అదునుగా భావించరాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. చాలా రాష్ట్రాలు కార్మిక చట్టాలను సవరిస్తున్నాయని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. సురక్షితమైన పనిప్రదేశాల్ని కల్పించే ప్రాథమిక నిబంధనల విషయంలో ఎలాంటి రాజీ ఉండొద్దని హితవు పలికారు.
కాంగ్రెస్ మరో సీనియర్ నేత జైరాం రమేశ్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, ఉద్దీపనల పేరిట పర్యావరణ, కార్మిక, భూచట్టాలను నీరుగార్చడం ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ మూలంగా ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న ఒడుదొడుకుల నుంచి గట్టెక్కే చర్యల్లో భాగంగా పలు రాష్ట్రాలు కార్మిక చట్టాల్లో మార్పు చేసేందుకు సిద్ధమయ్యాయి. ఉత్తరప్రదేశ్ సర్కార్ మూడు మినహా అమలులో ఉన్న అన్ని కార్మిక చట్టాల్ని రద్దు చేసింది. పనివేళల్లో సైతం మార్పులు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇదే బాటలో మరికొన్ని రాష్ట్రాలు సైతం పయనిస్తున్న నేపథ్యంలో రాహుల్‌గాంధీ తాజా వ్యాఖ్యలు చేశారు.