దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గుజరాత్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. తాజాగా 94మందికి వైరస్ సోకగా రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 2వేల 272కు చేరింది. ఈ 94 మందిలో 61 మంది అహ్మదాబాద్, 17మంది సూరత్, వడోదర నుంచి 8, అరావలి నుంచి ఐదుగురు, బోటాడ్ నుంచి ఇద్దరు, ఒకరు రాజ్కోట్వాసులని రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
గుజరాత్లో మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వైరస్ సోకి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 95కు చేరింది.
144మంది ఆసుపత్రుల నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 38వేల 59 మందికి వైరస్ పరీక్షలు నిర్వహించారు. 2,033 యాక్టివ్ కేసుల్లో 13మంది రోగుల పరిస్థితి విషమంగా ఉంది.
రాజస్థాన్‌లో...
రాజస్థాన్‌లో తాజాగా 64 కేసులు నమోదయ్యాయి. ఈ 64లో 44 కేసులు అజ్మీర్‌కు చెందినవే. ఫలితంగా రాష్ట్రంలో కేసుల సంఖ్య 1,799కు చేరింది. వైరస్‌తో ఇప్పటివరకు 26మంది మృతి చెందారు. మృతుల్లో 14మంది జైపుర్‌కు చెందినవారు ఉన్నారు. మొత్తం 97మంది వైరస్‌ను జయించారు.
గతంలో పంపిన 4వేల నమూనల ఫలితాలు బయటకు వస్తున్నట్టు.. ఇందువల్ల రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య పెరిగే అవకాశముందని రాజస్థాన్ ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఒడిశాలో 3...
ఒడిశాలో కరోనా కేసుల సంఖ్య 82కు చేరింది. తాజాగా భద్రాక్ జిల్లాకు చెందిన ముగ్గురికి వైరస్ సోకినట్టు తేలింది. వీరందరూ 40ఏళ్లు పైబడిన వారే.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఒడిశాలో పరిస్థితులు కొంత మెరుగ్గా ఉన్నాయి. ఇప్పటివరకు 13వేల 775మందికి పరీక్షలు నిర్వహించగా.. కేవలం 82మందికే వైరస్ ఉన్నట్టు తేలింది. వీరిలోని 30మంది ఇప్పటికే కోలుకున్నారు. కరోనా వైరస్ వల్ల రాష్ట్రంలో ఇప్పటివరకు ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
కర్ణాటకలో...
కర్ణాటకలో 7 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరిలో కలబుర్గికి చెందిన నాలుగు నెలల శిశువు ఉండటం ఆందోళనకర విషయం.
రాష్ట్రంలో 425మందికి వైరస్ సోకగా.. 17మంది ప్రాణాలు కోల్పోయారు. 129మంది డిశ్ఛార్జ్ అయ్యారు.
జవానుకూ...
జమ్ముకశ్మీర్‌లోని సీఆర్పీఎఫ్ బెటాలియన్‌లో చెందిన ఓ జవానుకు కరోనా సోకింది. సహాయక సిబ్బందిగా పని చేస్తున్న జవాను.. ప్రస్తుతం దిల్లీలోని ఓ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులో ఉన్నాడు. సెలవు కాలం ముగియడం వల్ల ఈ నెల 7న తిరిగి విధుల్లో చేరాలనుకున్నాడు ఆ జవాను. అయితే అధికారుల సూచన మేరకు. కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. అప్పటికే 14రోజుల క్వారంటైన్లో ఉన్న అతడికి వైరస్ సోకినట్టు మంగళవారం తేలింది.
ఇదీ చూడండి:- ఆరోగ్య సిబ్బంది రక్షణకై కేంద్రం ప్రత్యేక ఆర్డినెన్స్