కరోనా మహమ్మారిపై కీలక వ్యాఖ్యలు చేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. కొవిడ్-19ను ఒక విపత్తుగా మాత్రమే పరిగణించకూడదన్న వెంకయ్య.. భవిష్యత్తులో సమాజం ఎదుర్కొనే సవాళ్లపై దృష్టి నిలిపేలా చేసిందని అభిప్రాయపడ్డారు.
కొవిడ్-19 అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొనేందుకు లాక్డౌన్ కాలంలో ఎంతమేరకు సన్నద్ధమయ్యారో అంచనా వేసుకోవాలని ప్రజలకు వెంకయ్య సూచించారు. ఈ మేరకు ఫేస్బుక్ మాధ్యమంలో 'మ్యూజింగ్స్ ఆఫ్ లైఫ్ ఇన్ కరోనా టైమ్స్' అనే పోస్ట్‌ను పంచుకున్నారు.
జీవితాన్ని ఎప్పటికప్పడు అంచనా వేసుకుని.. లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగాలని చెప్పారు. అదే మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తుందని అభిప్రాయపడ్డారు.
'జీవిత గమనంపై స్వీయ మూల్యాంకనం ఉంటేనే పరిపూర్ణం అవుతుంది. అందుకు ఇదే సందర్భం. ఈ ధరిత్రికి కేవలం మానవులే అధిపతులన్న భావనే ప్రకృతి అసమతుల్యతకు కారణమైంది. అదే అన్ని ప్రతికూలతలను ప్రేరేపిస్తోంది. ధరిత్రిని మనం పట్టించుకోనప్పుడు, అది మనల్ని ఎందుకు పట్టించుకుంటుంది? ఆరోగ్యకరమైన జీవితాన్నిచ్చే ఆహారాన్ని ఔషధంగా చూడడం, భౌతిక సాధనలకు మించిన జీవితానికి ఆధ్యాత్మికతను పొందడం, సామాజిక బంధాలను పెంపొందించడం వంటివి పాటించాలి.'
- వెంకయ్యనాయుడు, భారత ఉపరాష్ట్రపతి
ప్రస్తుతం సమాజాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ కాలాన్ని ఓ అవకాశంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు వెంకయ్యనాయుడు.
ఇదీ చదవండి: '15 రోజుల్లో కరోనా కేసులు రెట్టింపు!'