మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో 12 రోజుల పసిపాప, ఆమె తల్లికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని నగర ముఖ్య వైద్యాధికారి డాక్టర్ ప్రభాకర్ ఆదివారం వెల్లడించారు. మహిళ ప్రసవ సమయంలో ఆసుపత్రిలో విధులు నిర్వహించిన ఆరోగ్య కార్యకర్త నుంచి వారికి ఈ వైరస్ సోకినట్లు అనుమానంగా ఉందని పాప తండ్రి చెబుతున్నారు. సదరు ఆరోగ్య కార్యకర్త కరోనా బారిన పడ్డట్లు ఇటీవలే తేలింది.
స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నెల 7వ తేదీన పాప జన్మించింది. 11వ తేదీన తల్లీబిడ్డ డిశ్చార్జి అయ్యి ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు ఆసుపత్రిలోని మహిళా కార్యకర్తకు కరోనా నిర్ధరణ అయింది. ఈ విషయాన్ని గమనించిన పాప తండ్రి.. తమవారికీ సోకిందేమోనని అనుమానించాడు. ఇదే విషయాన్ని ఆసుపత్రి వర్గాల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఇంటి సమీపంలోని హెల్త్‌క్యాంప్‌లో వైద్యులు ఇటీవల ఇద్దరి నమూనాలు సేకరించి పరీక్షకు పంపగా.. ఇద్దరికీ పాజిటివ్‌గా తేలింది. మధ్యప్రదేశ్‌లో ఈ మహమ్మారి బారిన పడ్డవారిలో తక్కువ వయస్సు ఈ పాపదే కావొచ్చని వైద్యవర్గాలు భావిస్తున్నాయి.
భోపాల్‌లో ఇప్పటివరకు 214 మంది కరోనా బారినపడగా.. 31 మంది మరణించారు.
ల్యాబ్ డాక్టర్‌కు కూడా...
ఇండోర్‌లో కొవిడ్-19 ల్యాబోరేటరీలో పనిచేస్తున్న ఓ వైద్యునికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆ డాక్టర్.. వైరస్ నమూనా పరీక్షలకు సంబంధించిన విధులు నిర్వహిస్తాడని అధికారులు చెబుతున్నారు.అతనితో సన్నిహితంగా ఉన్న అందరినీ క్వారంటైన్‌కు తరలించినట్లు స్పష్టం చేశారు.
మధ్యప్రదేశ్‌లో వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న ఇండోర్‌లో ఇప్పటివరకు 890 మందికి కరోనా సోకింది. మరో 50 మంది మరణించారు.