మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇందుకోసం ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌రూంల పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మధ్యాహ్నం కల్లా ఫలితంపై స్పష్టత రానుంది.
288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి... 3 వేల 237 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. రాష్ట్రంలోని 8 కోట్ల 98 లక్షల మంది ఓటర్లలో 60.46 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మిత్రపక్షాలతో బరిలోకి అగ్రపార్టీలు...
మరాఠా గడ్డపై వరుసగా రెండోసారి అధికారం సొంతం చేసుకోవాలని చూస్తోన్న భాజపా... ఈసారి మిత్రపక్షం శివసేనతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగింది. భాజపా 164, సేన 124 స్థానాల్లో పోటీ చేశాయి. మరోవైపు పునర్వైభవాన్ని సాధించాలన్న లక్ష్యంతో ప్రతిపక్ష కాంగ్రెస్, ఎన్సీపీ పొత్తుతో పోటీ చేశాయి. కాంగ్రెస్147, ఎన్సీపీ 121 చోట్ల బరిలోకి దిగాయి. రాజ్‌ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన 101 స్థానాల్లో, బీఎస్పీ 262 స్థానాల్లో పోటీ చేయగా.. 1400 మందికిపైగా స్వతంత్ర అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
భాజపావైపే ఎగ్జిట్ పోల్స్...
2014 ఎన్నికల్లో భాజపా 122 స్థానాల్లో, శివసేన 63 స్థానాల్లో గెలుపొందాయి. కాంగ్రెస్ 42, ఎన్సీపీ 41 చోట్ల నెగ్గాయి.అయితే.. ఎన్నికల అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కమలదళానికి అనుకూలంగా ఉన్నాయి. భాజపా-శివసేన కూటమిదే విజయమని ఘంటాపథంగా చెప్పాయి. మహారాష్ట్రలో మూడింట రెండొంతులకుపైగా సీట్లు నెగ్గుతుందని అంచనాలున్నాయి. కాంగ్రెస్ సహా ఇతర పక్షాలకు ఏ మాత్రం అవకాశాల్లేవని స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో గురువారం వెలువడే ఫలితం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.