బిహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జోరుగా సాగుతోంది. 38 జిల్లాల్లోని 55 కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలైంది. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లతో పాటు కరోనా వ్యాప్తి దృష్టిలో ఉంచుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాల్మీకి నగర్ లోక్‌సభ నియోజకవర్గానికి నిర్వహించిన ఉపఎన్నిక కౌంటింగ్ సైతం జరుగుతోంది.
ఓట్ల లెక్కింపును పరిశీలిస్తే ఎన్డీఏ, మహాకూటమి హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇరు కూటముల మధ్య ఆధిక్యం స్వల్పంగా ఉంటోంది.
బరిలో నిలిచిన 3,700 భవితవ్యం ఈ కౌంటింగ్ తర్వాత తేలనుంది. మొత్తం 243 నియోజకవర్గాలున్న బిహార్ అసెంబ్లీలో.. ఆధిక్యానికి 122 స్థానాల్లో గెలుపు అవసరం. అయితే ఇప్పటివరకు పరిణామాలు పరిశీలిస్తే ఫలితం ఏకపక్షంగా లేదని స్పష్టమవుతోంది.
ఆలస్యంగా ఫలితాలు
అసెంబ్లీ ఫలితాలు అనుకున్న సమయం కంటే ఆలస్యంగా వెలువడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సురక్షిత దూరం పాటించేందుకు పోలింగ్ స్టేషన్ల సంఖ్య పెంచడం వల్ల కౌంటింగ్‌కు ఎక్కువ సమయం పడుతుందని చెప్పారు. ఇదివరకు 72,723 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఈసారి 46.5 శాతం అధికంగా 1,06,515 కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహించారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, హరియాణా, ఒడిశా, నాగాలాండ్, మణిపుర్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో నిర్వహించిన ఉపఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.