గుప్తా పరివారం... ఉత్తరాఖండ్‌లో పేరుగాంచిన వ్యాపారవేత్తల కుటుంబం. ఇద్దరు అన్నదమ్ములు అజయ్ గుప్తా, అతుల్ గుప్తాల వారసులకు త్వరలో పెళ్లిళ్లు. ప్రస్తుతం ఆహ్వాన పత్రికలు పంచుతోంది ఆ పరివారం. ఆ పత్రికలను అందుకున్న వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకో తెలుసా...! ఒక్కో పెళ్లి కార్డును రెండు కిలోల వెండితో తయారు చేయించారు. ఒక్కో ఆహ్వాన పత్రిక విలువ రూ. 8 లక్షలు. ఈ నెల 18 నుంచి 22 వరకు జరగనున్న ఈ వివాహ వేడుకల నిర్వహణకు చేసే ఖర్చు... 200 వందల కోట్లు.
అజయ్ కుమారుడు సూర్యకాంత్ వివాహ మహోత్సవం ఈ నెల 18 నుంచి 20 వరకు జరగనుండగా, అతుల్ వారసుడు శశాంక్ పెళ్లి వేడుకలను 20 నుంచి 22 వరకు నిర్వహిస్తున్నారు.
పెళ్లిని ఉత్తరాఖండ్‌లో చేయడానికి కారణం... ఇది దేవభూమి. మా అమ్మకు ఈ ప్రాంతమంటే ఎంతో ఇష్టం. కేదార్ఖండ్లో శివుడి పెళ్లి జరిగిందని మా అమ్మ చెప్పారు. ఇక్కడే పిల్లల పెళ్లిళ్లు చేయాలని కోరారు. మేం ముఖ్యమంత్రిని కలిశాం. ఉత్తరాఖండ్‌ను వివాహాలకు నిలయంగా మార్చాలని అధికారులు కోరుకుంటున్నారు. వివాహాల విషయంలో వారి సహకారం అందిస్తున్నారు.
-అనిల్ గుప్తా, వ్యాపారవేత్త
అబ్బురపరిచే పెళ్లి కార్డు
బాక్స్ రూపంలో పెళ్లికార్డును తయారు చేశారు. పెట్టె తెరవగానే వధూవరుల పేర్లతో ఆహ్వాన పత్రిక దర్శనమిస్తుంది. సాధారణ ఆహ్వాన పత్రికలో ఉన్నట్లుగానే పెళ్లి జరిగే స్థలం, వివాహ విందు వివరాలు హిందీ, ఆంగ్ల భాషల్లో ఉంటాయి.
దక్షిణాఫ్రికాలో వ్యాపారాలు, వివాదాలు
1993 సంవత్సరంలో స్వరాష్ట్రాన్ని వీడి దక్షిణాఫ్రికా చేరింది గుప్తాల కుటుంబం. అక్కడ వ్యాపారాలు నిర్వహించి లాభపడింది. అవినీతి ఆరోపణలతో పదవీచ్యుతుడైన మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమాతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ప్రస్తుతం గుప్తాలు విచారణను ఎదుర్కొంటున్నారు. దక్షిణాఫ్రికా ఆర్థిక విధానాన్ని ప్రభావితం చేసేందుకూ గుప్తాలు యత్నించారని అభియోగాలు ఉన్నాయి.
ఇదీ చూడండి- నేనేమీ పాకిస్థాన్ కోచ్‌ను కాదు: రోహిత్