దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతోన్న కోరనాపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందించారు. ఈ వైరస్ కారణంగా ప్రజలెవ్వరూ భయాందోళనలు చెందొద్దన్నారు. ఈ మహమ్మారి తీవ్ర అందోళన కలిగిస్తోందని, ఎందరో జీవితాలను ప్రమాదంలోకి నెడుతోందని.. లక్షలాదిమంది జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సవాలను ధైర్యంగా అధికమించగలమని నమ్ముతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు సోనియా.
బాధితులకు అండగా...
కరోనా బాధితులకు అండగా నిలబడేలా కొన్ని చర్యలను చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు సోనియా. ఆర్థికంగా కుంగిపోయిన వారికి మద్దతుగా నిలిచేందుకు రంగాల వారీగా ఉపశమన ప్యాకేజీలను ప్రకటించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
దేశవ్యాప్తంగా కరోనా వైద్య పరీక్షా కేంద్రాలను మరింత పెంచాలని, ప్రత్యేక వెబ్సైట్ల ద్వారా ఆసుపత్రులు, వైద్య సదుపాయాల వివరాలను ప్రజలకు తెలియజేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.
వ్యవసాయ రంగంపైనా ప్రభావం..
కరోనా ప్రభావం వ్యవసాయ రంగంపైనా పడిందని, వారికి ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని సూచించారు.
" వడ్డీ ఉపసంహరణ, పన్ను మినహాయింపు వంటి వాటిపై దృష్టి కేంద్రీకరించాలి. ప్రజలకు ముసుగులు, నిత్యవసారాలు తగినంతగా సరఫరా అయ్యేలా చూడాలి. కరోనా నిర్ధరణ అయిన కేసులను నిఘాలో ఉంచాలి, రోగ లక్షణాలున్న వారిని, రోగులతో సంబంధం ఉన్నవారినీ పర్యవేక్షణలో ఉంచాలి. కరోనా అన్ని వ్యాపార సంస్థలపై ప్రభావం చూపింది. ముఖ్యంగా మైక్రో, మీడియం వ్యాపారాలపై ఈ ఒత్తిడి తీవ్రంగా కనిపిస్తోంది."
- సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు