'నిర్లక్ష్యం... మాస్కులు వేసుకోమంటే నిర్లక్ష్యం. చేతులు కడుక్కోమంటే నిర్లక్ష్యం. కనీసం తుమ్మినప్పుడు చేతులు అడ్డు పెట్టుకోమంటే నిర్లక్ష్యం. ఇలా కరోనా జాగ్రత్తలు పాటించకుండా ఇష్టం వచ్చినట్టు రోడ్లపై తిరిగితే.. మా ఆరోగ్యాలు ఏం కావాలి?' అంటూ... మాస్క్ లేకుండా తుమ్మిన ఓ వ్యక్తి తాటతీశారు మహారాష్ట్రకు చెందిన దంపతులు.
ఓ వైపు కరోనా యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఇలాంటి సమయంలో కొల్హాపుర్లోని గుజారీలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి కరోనా జాగ్రత్తలను పెడచెవినపెట్టాడు. ముఖానికి మాస్క్లేకుండా, కనీసం చేతులు అడ్డుపెట్టుకోకుండా నడిరోడ్డుపై తుమ్మాడు.
అతడి పక్కనే మరో బైక్పై వెళ్తున్న దంపతులు ఇదంతా గమనించి.. మాస్క్ ధరించి తుమ్మాలని సలహా ఇచ్చారు. అంతే, ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది.
"జాగ్రత్తలు పాటించకుండా తుమ్మడమే తప్పు, పైగా వాదిస్తావా" అంటూ.. తుమ్మిన వ్యక్తికి దేహశుద్ధి చేశారు దంపతులు. సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డైన ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.
ఇదీ చదవండి:ప్రపంచ మహమ్మారి కరోనాపై మహా సంగ్రామం!