దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. శనివారం ఉదయానికి దేశవ్యాప్తంగా 873 పాజిటివ్ కేసులు(విదేశీయులతో కలిపి) నమోదైనట్లు ప్రకటించింది కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ. కొవిడ్-19 కారణంగా దేశంలో ఇప్పటివరకు మొత్తం 19 మంది మృతి చెందినట్లు వెల్లడించింది. అయితే కొత్తగా నమోదైన 2 మరణాలు ఏ రాష్ట్రానికి సంబంధించినవనే అంశంపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
వైరస్ సోకిన మొత్తం బాధితుల్లో 78 మంది కోలుకోగా.. ప్రస్తుతం 775 మంది చికిత్స పొందుతున్నారు.
పెరుగుతున్న కేసులు:
మహారాష్ట్రలో కొవిడ్-19 తీవ్రత ఎక్కువగా ఉంది. తాజాగా మహారాష్ట్రలో మరో ఆరుగురికి వైరస్ సోకింది. ముంబయిలో ఐదుగురు, నాగ్‌పుర్‌లో ఒకరికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు తెలిపారు. ఫలితంగా ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 159కి చేరింది.