లాక్డౌన్ 3.0లో ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించడం తప్పనిసరి అయిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ దిశగా చర్యలు తీసుకోవటం క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులకు అద్దం పడుతుందని పేర్కొన్నారు.
ఓ వైపు కరోనాపై పోరాడేందుకు లాక్డౌన్ను మే 17 వరకు కొనసాగించినా.. ఆర్థిక సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని సడలింపులు ఇవ్వాల్సిన అవసరం ఏర్పడిందన్నారు వెంకయ్య.
"లాక్డౌన్ పొడిగింపు నిర్ణయం కరోనాపై సమష్టిగా పోరాడేందుకు సహకరిస్తుంది. సడలింపులతో రాష్ట్ర ప్రభుత్వాలు, సంస్థలు, వాణిజ్య, పరిశ్రమ వర్గాలు కలిసి వస్తాయని నా అభిప్రాయం. లాక్డౌన్ 3.0లో కరోనా పూర్వ స్థితికి పరిస్థితులు వచ్చే లక్ష్యంతో పనిచేయాలి.
ఈ రెండువారాలు మన కాలాన్ని నిర్ణయిస్తాయి. ఇది ఒక రకంగా పరీక్ష వంటిదే. మనం అందరం ఇందులో ఉత్తీర్ణులం కావాలి. ఫెయిల్ అనే అవకాశం లేనందువల్ల మనం సాధించగలమనే నమ్మకం నాకుంది."
- వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి
ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం అనుసరిస్తున్న వ్యూహాలు సానుకూల ఫలితాలను ఇచ్చాయని వెంకయ్య అన్నారు. మొదటి రెండు లాక్డౌన్లలో వచ్చిన మార్పులు.. వైరస్ను తుదముట్టించే వరకు కొనసాగాలని ఆకాంక్షించారు.
ప్రపంచం నివ్వెరపోయింది..
ముందుచూపు, దృఢసంకల్పం, నిబద్ధతతో ఉన్న భారత్.. కరోనాపై పోరాటంలో ముందంజలో ఉందన్నారు వెంకయ్య. 130 కోట్ల జనాభా, ఆర్థిక, జీవన, సామాజిక వైవిధ్యమున్న దేశం వ్యవహరించిన తీరుతో ప్రపంచం ఆశ్చర్యపోయిందన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, రైతుల కృషి ప్రశంసించాల్సిన అవసరం ఉందన్నారు వెంకయ్య. అయితే యుద్ధం ఇంకా గెలవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి: నిర్మలతో మోదీ భేటీ- రెండో ఆర్థిక ప్యాకేజీపై చర్చ!