కరోనా వైరస్ బాధితుల సంఖ్య ప్రపంచంలోని మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లో తక్కువగా కనిపించినప్పటికీ మరణాల రేటు మాత్రం అమెరికా కంటే ఎక్కువగానే ఉంటోంది. సోమవారం ఉదయం నాటికి నమోదైన లెక్కల ప్రకారం ఈ వైరస్ సోకిన వారిలో అమెరికాలో ఈ మరణాల రేటు 1.74%గా ఉండగా, భారత్‌లో అది 2.70%గా ఉంది. ఇది ప్రపంచ సగటు (4.69%) కంటే తక్కువే అయినప్పటికీ చాలా దేశాలతో పోలిస్తే ఇది ఎక్కువే.
సోమవారం ఉదయం 10 గంటలకు విభిన్న దేశాల్లో నమోదైన కరోనా కేసుల్లో సంభవించిన మరణాలు, కోలుకున్న వారి శాతం ఇలా...
ఇటలీ, స్పెయిన్, చైనా, ఫ్రాన్స్, ఇరాన్, బ్రిటన్, నెదర్లాండ్స్, బెల్జియంలలో మరణాల శాతం 4% నుంచి 11% వరకు నమోదైంది. ఇది ప్రపంచ సగటు కంటే చాలా ఎక్కువ. జర్మనీలో కేసుల సంఖ్య భారీగా ఉన్నా మరణాల రేటు 0.8%కే పరిమితమైంది. ఆదివారం నాటికి భారత్‌లో 35వేల పరీక్షలు జరపగా అందులో 1,024 మందికి పాజిటివ్‌గా తేలింది. అంటే.. అనుమానిత కేసుల్లో 2.92% మందిలో ఈ వైరస్ ఉంటోంది.
జాగ్రత్తలు పాటించకపోతే కష్టం
ప్రజలు ప్రభుత్వం చెప్పిన ఆంక్షలు పాటించకుండా, సామాజిక దూరం, ఇతర నిబంధనలను పాటిస్తే మహమ్మారి నుంచి తప్పించుకోవచ్చు. ఎయిడ్స్ వ్యాప్తి తీరును బట్టి 2వేల సంవత్సరానికల్లా దేశంలో ఆ రోగుల సంఖ్య 4 కోట్లకు పెరుగుతుందని 1990లలో అంచనా వేసినట్లు భారత వైద్య పరిశోధన మండలి నిపుణులు చెప్పారు.
అయితే ఈ వ్యాధి పట్ల ప్రజలు అవగాహన పెంచుకొని, ప్రభుత్వం చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించడంవల్ల ప్రస్తుతం ఆ సంఖ్య 24 లక్షలకు మించలేదని తెలిపారు. సాంక్రమిక వ్యాధుల వ్యాప్తి, నియంత్రణ అనేది ప్రజా చైతన్యంపై ఆధారపడి ఉంటాయన్నారు.