దేశంలో కరోనా కేసుల సంఖ్య 30కి చేరింది. అప్రమత్తమైన కేంద్రం వైరస్ వ్యాప్తి నిరోధానికి మరిన్ని చర్యలు చేపట్టింది. కరోనా కట్టడికి జిల్లా, గ్రామ స్థాయిల్లో సత్వర స్పందన బృందాలను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. జిల్లా కలెక్టర్లను వైరస్ నివారణ చర్యల్లో భాగం చేయాలని కోరింది.
ప్రస్తుతం 21 విమానాశ్రయాల్లో కరోనా పరీక్షలు జరుపుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ వెల్లడించారు. ఇప్పటి వరకూ వివిధ విమానాల్లో వచ్చిన 6 లక్షల మందికి పరీక్షలు చేసినట్లు చెప్పారు. ఎవరికీ వైరస్ నిర్ధరణ కాలేదని వివరించారు.
త్రివిధ దళాలు...
భారత సైన్యం, వైమానిక దళంలో దగ్గు, జలుబు చేసిన వారికి ఉదయం పూట పరేడ్ చేసే సమయంలో వైరస్ పరీక్షలు నిర్వహించాలని రక్షణశాఖ అధికారులు ఆదేశించారు. దేశంలో పరిస్థితులు మెరుగుపడేంత వరకూ ఎక్కువమంది గుమిగూడే సమావేశాలు, కార్యక్రమాలపై త్రివిధ దళాల్లో నిషేధం విధించారు.
దిల్లీలో...
దిల్లీలోని లోక్‌నాయక్ జయప్రకాశ్ ఆసుపత్రిలో 11 ప్రత్యేక ఐసోలేషన్ గదులను ఏర్పాటు చేసినట్లు దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. దిల్లీలోని 11 జిల్లాల్లో ఒక్కో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నేతృత్వంలోని కార్యదళం నిర్ణయించింది. హస్తినలో మార్చి 31 వరకూ ప్రాథమిక పాఠశాలలను మూసివేయాలని ఆదేశించింది.
జైపుర్‌లో...
జైపుర్‌లో వైరస్ సోకిన ఇటలీ జంట కలిసిన 68 మందికి కరోనా లేదని పరీక్షల్లో వెల్లడైంది. మరో 8 మంది ఫలితాలు రావాల్సి ఉందని..అధికారులు తెలిపారు.
వైరస్ బతకదు...
చికెన్, మటన్, చేపల ద్వారా కరోనా వైరస్ వస్తుందనేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ అధిపతి జీఎస్జీ అయ్యంగార్ వెల్లడించారు. అత్యధిక ఉష్ణోగ్రతల్లో వైరస్ జీవించలేదని ఆయన చెప్పారు. ఉష్ణమండల దేశమైన భారత్‌లో ఉష్ణోగ్రతలు 35-36 దాటగానే వైరస్ జీవించదని ఆయన చెప్పారు.
ఇదీ చూడండి: నిర్భయ దోషులకు వేర్వేరుగా ఉరిపై విచారిస్తాం: సుప్రీం