దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1594మంది వైరస్ బారినపడ్డారు. 51 మంది ప్రాణాలు కోల్పోయారు.
మహారాష్ట్ర సచివాలయంలో..
మహారాష్ట్రలో వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. రాష్ట్ర సచివాలయంలోని నలుగురికి కరోనా సోకింది. ఈ కారణంగా రెండురోజులపాటు సచివాలయాన్ని మూసేస్తున్నట్లు ప్రకటించారు అధికారులు. వైరస్ బారినపడిన ఉద్యోగులను ఆసుపత్రికి తరలించారు. మహారాష్ట్రలో ఇప్పటివరకు 8590మందికి వైరస్ సోకింది. 369మంది వైరస్ కారణంగా మృతి చెందారు.
ఒడిశాలో మరో ఏడుగురికి..
ఒడిశాలో మరో ఏడుగురికి కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 118కి చేరింది. రాష్ట్రంలో 37మందికి వైరస్ నయమవగా..యాక్టివ్ కేసుల సంఖ్య 80 గా ఉంది.
కశ్మీర్లో వృద్ధురాలు మృతి..
జమ్ముకశ్మీర్‌లో కరోనాతో ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. శ్రీనగర్ ఆసుపత్రిలో కరోనాకు చికిత్స పొందుతున్న వృద్ధురాలు ఆరోగ్యం విషమించి మృతి చెందింది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎనిమిదిమంది వైరస్‌కు బలయ్యారు. 546మందికి వైరస్ సోకింది.
సీఆర్పీఎఫ్ జవాను..
దిల్లీలో వైరస్ కారణంగా సీఆర్పీఎఫ్ జవాను ప్రాణాలు కోల్పోయారు. ఏఎస్ఐ స్థాయి అధికారి అనారోగ్య కారణంగా సఫ్దార్జంగ్ ఆసుపత్రిలో చేరాడు. అతనికి వైరస్ ఉన్నట్లు నిర్ధరణ అయింది. అనంతరం చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. కేంద్ర బలగాల్లో వైరస్‌తో నమోదయిన తొలి మృతి ఇదే. మరో 23మంది జవాన్లు వైరస్‌తో ఆసుపత్రిలో చేరారు.
రాష్ట్రాలవారీగా..
కేసుల సంఖ్య గుజరాత్లో 3548, దిల్లీలో 3108, మధ్యప్రదేశ్‌లో 2368, రాజస్థాన్‌లో 2262, తమిళనాడులో 1937, ఉత్తర్‌ప్రదేశ్‌లో 2043కు పెరిగింది. మహారాష్ట్ర తర్వాత అత్యధికంగా గుజరాత్లో 162మంది, మధ్యప్రదేశ్‌లో 113 మంది వైరస్‌తో అసువులు బాశారు.
ఇదీ చూడండి: యూపీలో ఇద్దరు పూజారుల హత్య- యోగిపై విపక్షాల విమర్శలు