భారత్‌ను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. అన్‌లాక్-1లో వైరస్ తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మహారాష్ట్రలో తాజాగా 5వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో ఒక్కరోజులోనే 3,949 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.
మహాలో కరోనా టాప్‌గేర్...
మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. సోమవారం తాజాగా 5,257 కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,69,883కు చేరింది. ఒక్కరోజులోనే 181 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 73,298 యాక్టివ్ కేసులున్నాయి.
తమిళనాడులో...
తమిళనాడులో మరో 3,949 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 62మంది మహమ్మరికి బలయ్యారు. దీంతో మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 86,224కు చేరింది. ఇప్పటివరకు 1,141 మంది వైరస్‌తో పోరాడి మరణించారు. కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు మూడో స్థానంలో కొనసాగుతోంది.
దిల్లీలో కరోనా..
దేశ రాజధాని దిల్లీలోనూ మహమ్మారి కలకలం రేపుతోంది. సోమవారం 2084 మందికి పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. 57 మంది మృత్యువాత పడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 85,161కి చేరగా.. 2,680 మందిని వైరస్ బలితీసుకుంది.
బంగాల్లో 624 కేసులు...
బంగాల్‌లోనూ కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా 624 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. గడిచిన 24 గంటల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో వైరస్ బాధితుల సంఖ్య 17,907కు, మృతుల సంఖ్య 653కు చేరింది.
గుజరాత్లో..
గత 24 గంటల్లో గుజరాత్లో మరో 19మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా.. 626 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 32,023 మంది వైరస్ బారిన పడ్డారు. మృతుల సంఖ్య 1,828కి చేరింది.
పంజాబ్‌లో..
పంజాబ్‌లో తాజాగా 202 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ఐదుగురు మహమ్మారితో మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 5,418 మందికి వైరస్ సోకింది. మృతుల సంఖ్య 138కి చేరింది. మొత్తం 3,764 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.
కేరళ పరిస్థితి..
కేరళలో సోమవారం 121మందికి కరోనా నిర్ధరణ అయ్యింది. వీరిలో 78 మంది విదేశాల నుంచి రాగా.. 26 కేసులు ఇతర రాష్ట్రాలకు చెందినట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు. కొత్తగా కరోనా సోకిన వారిలో.. 9 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది, ముగ్గురు వైద్య సిబ్బంది ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 4,311మందికి వైరస్ నిర్ధరణ అయినట్లు పేర్కొన్నారు.
ఎమ్మెల్యేకు కరోనా..
మధ్యప్రదేశ్‌లోని రేవా నియోజకవర్గానికి చెందిన భాజపా ఎమ్మెల్యేకి కరోనా పాజిటీవ్‌గా తేలింది. ఈ నెలలోనే ముగ్గురు శాసన సభ్యులకు వైరస్ సోకినట్లు గుర్తించారు.