మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కుటుంబ సభ్యులపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర వీడియోను పోస్ట్ చేసిన బాలీవుడ్ నటి పాయల్ రోహత్గీని రాజస్ధాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మోతీలాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ ఇతర కుటుంబ సభ్యులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వీడియోను పాయల్ సెప్టెంబర్‌లో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోపై కాంగ్రెస్ నేత చార్మేష్ శర్మ ఫిర్యాదు చేయగా.. ఆమెపై అక్టోబర్ 10న పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ విషయంపై వివరణ ఇవ్వాలని పాయల్‌కు రాజస్థాన్ పోలీసులు నోటీసులు జారీ చేసినా స్పందించలేదని, ఆమెను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. గూగుల్ నుంచి సేకరించిన సమాచారంతో తాను చేసిన పోస్ట్‌పై తనను రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారని పాయల్ అన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ జోక్‌గా మారిందని పాయల్ ట్వీట్ చేశారు.
పాయల్ రోహత్గీని గుజరాత్ నుంచి రాజస్థాన్ తీసుకువస్తామని ఎస్పీ మమతా గుప్తా వెల్లడించారు. పాయల్ ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం కోర్టు విచారణ చేపట్టనుంది. తనపై చర్యలు చేపట్టాలని గాంధీ కుటుంబ సభ్యుల నుంచి రాజస్ధాన్ సీఎంపై ఒత్తిళ్లు వస్తున్నాయని నటి పాయల్ ఇటీవల ఆరోపించారు.