భారత్ జనవరి 26న 71వ గణతంత్ర వేడుకలు జరుపుకోబోతుంది. స్వాతంత్య్రానంతరం స్వయంపరిపాలన కోసం మన రూపొందించుకున్న రాజ్యాంగం.. 70 ఏళ్లు పూర్తిచేసుకోబోతుంది.
ఈ నేపథ్యంలో విశ్రాంత మాజీ ఐఏఎస్ అధికారి వీకే అగ్నిహోత్రితో ఈటీవీ భారత్ మాట్లాడింది. 1968 బ్యాచ్ అధికారి అయిన అగ్నిహోత్రి.. 2007-12లో రాజ్యసభ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. భారత రాజ్యాంగం బలాలు, బలహీనతలతో పాటు వివిధ అంశాలపై ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు.
ఎన్నో ఆశలు, ఆశయాలతో మన రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం. ఈ 70 ఏళ్ల కాలంలో వాటిని మనం సాధించుకున్నామా?
రాజ్యాంగం అనేది నా దృష్టిలో ప్రభుత్వ వ్యవస్థను నడిపించే ఒక పత్రం. పార్లమెంటు, న్యాయవ్యవస్థ, కార్యనిర్వహణ శాఖలు సమర్థంగా పని చేసేందుకు కావాల్సిన మార్గదర్శకాలు, ఆశయాలు, సూచనలు పొందుపరిచి ఉంటాయి. మన రాజ్యాంగానికి విస్తృతమైన ఫ్రేమ్‌వర్క్ ఉంటుంది. ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం అయినప్పటికీ చాలా విషయాలను సూచించదు. మొదట 395 అధికరణలు ఉండగా వాటి సంఖ్య ప్రస్తుతం 470కి చేరువలో ఉంది. రాజ్యాంగ సభ ఎంతో శ్రమకోర్చి మన రాజ్యాంగాన్ని రూపొందించింది. ఈ 70 ఏళ్లలో ఎన్నో సవరణలను మనం తీసుకొచ్చాం. ఎందుకంటే.. కాలానుగుణంగా మారుతున్న సమాజం, ఆలోచనలు, అవసరాల మేరకు రాజ్యాంగ సవరణలు తప్పనిసరి. ఒకవేళ కొన్ని సవరణలు, చట్టాలు రాజ్యాంగ స్ఫూర్తితో లేనట్లయితే న్యాయవ్యవస్థ జోక్యం చేసుకుని వాటిని మార్చాలని శాసన వ్యవస్థకు ఆదేశాలు ఇస్తుంది.
ఎప్పటికప్పుడు మార్పు కోరుకునే కారణంతోనే మన రాజ్యాంగాన్ని సజీవ పత్రంగా పిలుస్తారా?
అవును.. భారత రాజ్యాంగం సజీవ పత్రం. ఏదైనా కఠిన నిబంధనను సడలించాలంటే.. రాజ్యాంగాన్ని మార్చకుండా అధికరణను సవరిస్తే సరిపోతుంది. ఉదాహరణకు అధికరణ 370. ఆ సమయంలో రాజ్యాంగాన్ని సవరించలేదు. అయితే అన్నింటికి ఇదే సూత్రం వర్తించదు. కొన్ని సవరణలకు ద్విసభలు వేర్వేరుగా ఆమోదించాలి. మరికొన్ని సవరణలకు రాష్ట్రాల శాసనసభల ఆమోదం లభించాలి.
అయినప్పటికీ మన రాజ్యాంగం ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ తరహాలో కఠినమైనది కాదు. అక్కడి తరహాలో భారత రాజ్యాంగ సవరణకు ప్రజాభిప్రాయ సేకరణ అవసరం లేదు. అమెరికాలోనూ ప్రతి సవరణకు ద్విసభల ఆమోదం తర్వాత 75 శాతం రాష్ట్రాలు ఆమోదించాలి. కానీ మనం సగం కన్నా ఎక్కువ రాష్ట్రాలు ఆమోదిస్తే సరిపోతుంది. ఉదాహరణకు.. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను పొడగించేందుకు 104 సవరణ చేశారు. అధికరణ 334ను 10 ఏళ్లు పొడగించేందుకు పార్లమెంటుతో పాటు రాష్ట్రాల ఆమోదమూ అవసరమైంది. ఇప్పటికీ ఈ బిల్లు పెండింగ్‌లోనే ఉంది. రాజ్యాంగ సవరణలన్నింటికీ అంత సులువుగా ఆమోదం లభించదు.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో సుమారు 60 రిట్లు దాఖలయ్యాయి. అందులో ఎక్కువ శాతం సీఏఏ రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వపు హక్కును ఉల్లంఘించారని ప్రశ్నించినవే. ఈ విషయాన్ని మీరు ఎలా పరిగణిస్తారు?
పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగంలో భాగం కాదు. ఇది సాధారణ శాసనం కావటం వల్ల దాన్ని సవరించారు. సీఏఏ అనేది రాజ్యాంగానికి సవరణ కాదు. కానీ ప్రాథమికంగా రెండు కారణాలతో ఈ చట్టానికి సవాళ్లు ఎదురయ్యాయి. ఒకటి లౌకికవాదం.. ఎందుకంటే ఈ చట్టంలో ముస్లింలను మినహాయించారు. రెండోది సమానత్వపు హక్కు. చట్టం ముందు అందరూ సమానులే అని రాజ్యాంగం ప్రకటిస్తుంది.
అయితే ఈ విషయంలో న్యాయస్థానం ఎలా స్పందిస్తుందో చూడాల్సిందే. ఎందుకంటే.. ప్రభుత్వం, పార్లమెంటు అన్ని చట్టాలను పరిగణనలోకి తీసుకునే సవరణను తీసుకొచ్చాయి. పార్లమెంటు ఆమోదం పొందిన చట్టాన్ని రాజ్యాంగ చట్రంలోకి వస్తుందా? లేదా? అని పరిశీలించాల్సిన పని న్యాయవ్యవస్థకు ఉంటుంది. చట్టం చెల్లదని న్యాయస్థానం నిర్ధరించే వరకు దానిని అమలు చేయమని రాష్ట్రాలకు చెప్పే అధికారం లేదు.
అధికరణ 246 ప్రకారం కొన్ని చట్టాలను రాష్ట్రాలు అమలు చేయలేమని చెప్పవచ్చు. కానీ పౌరసత్వమనే అంశం కేంద్ర జాబితాలోనిది. అందువల్ల పౌరసత్వ నిబంధనలను సవరించే పూర్తి అధికారం పార్లమెంటుకే ఉంది.
రెండోది.. అధికరణ 256 ప్రకారం పార్లమెంటు చేసిన చట్టాలను రాష్ట్రాలు అమలు చేసేందుకు కట్టుబడి ఉండాలి. అందువల్ల చట్టాన్ని అమలు చేయలేమని రాష్ట్రాలకు చెప్పే అధికారం లేదు. అప్పుడు అధికరణ 365 ప్రకారం.. పార్లమెంటు చేసిన చట్టాలు రాష్ట్రాలు అమలు చేయకపోతే.. రాష్ట్రంలో రాజ్యాంగ పాలన విఫలమైనట్టుగా గుర్తిస్తారు. ఫలితంగా ఆ రాష్ట్రంలో అధికరణ 356తో రాష్ట్రపతి పాలనను విధిస్తారు.
అయితే పెద్ద ఎత్తున రాష్ట్రాలు చట్టాన్ని వ్యతిరేకిస్తే రాష్ట్రపతి పాలన విధించేందుకు సాధ్యపడదు. కానీ ఇది చట్టాన్ని సవరించకముందే చేయాల్సి ఉంటుంది. కొన్ని పార్టీలు ఆ దిశగా కృషి చేస్తున్నాయి.
వాదోపవాదాల్లో అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా ఉందంటారు? ఇప్పుడు జరుగుతన్న చర్చలపై మీ రేటింగ్ ఎంత?
ఈ విషయం చాలా ఆందోళన కలిగిస్తుంది. వాదోపవాదాల్లో నాణ్యత తగ్గిపోయిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రస్తావించారు. రాజ్యసభ విషయానికి వస్తే ఇది పెద్దల సభ. ఇక్కడ స్పష్టమైన చర్చ జరిగేది. పెద్దల సభలో సమర్థులు ఉండేవారు. పెద్దల వద్దకు సూచనల కోసం వెళ్లినట్లు ఉండేది. ఏళ్లు గడిచిన కొద్దీ చాలా మార్పులు వచ్చాయి.
ఇప్పుడు సాంకేతికంగా రాజ్యసభ అని పిలువలేము. ఎందుకంటే మొదట రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి మాత్రమే ఆ రాష్ట్రం తరఫున రాజ్యసభకు వెళ్లేవారు. ఎంతో పాలనానుభవం, సామాజిక సేవ చేసిన వారు ఎన్నికయ్యేవారు.
రాజ్యాంగానికి సంబంధించి బలాలు, బలహీనతలేంటని మీరు భావిస్తున్నారు?
రాజ్యాంగానికి ఏదీ బలమో అదే బలహీనత. ఎందుకంటే.. ప్రభుత్వ పాలనకు పూర్తి ఆధారం రాజ్యాంగమే. ఇక్కడ మనం వేరే మార్గాల ద్వారా సూచనలు, మార్గదర్శకాలు ఇవ్వలేము. ప్రాథమిక హక్కులు రాజ్యాంగాన్ని దృఢంగా చేశాయి. వీటిని సవరించలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. కానీ 24వ సవరణ తర్వాత ప్రాథమిక హక్కులను మార్చవచ్చని పార్లమెంటు తెలిపింది.
బలహీనత విషయానికి వస్తే.. ప్రతి పాలన విధానాన్ని రాజ్యాంగం నిర్వహిస్తుంది. అందువల్ల చిన్న చిన్న అంశాలకు సంబంధించి సవరణలు అవసరమవుతాయి. 70 ఏళ్లలో మొత్తం 104 సవరణలు చేశారు. ప్రపంచంలో ఏ రాజ్యాంగానికి ఇన్ని సార్లు సవరణలు జరగలేదు.
ప్రాథమిక విధులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఇటీవల చాలా వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై మీరేమంటారు?
అవును.. ప్రాథమిక విధులు రాజ్యాంగంలో పొందుపరిచారు. కానీ అవి తప్పనిసరిగా పాటించాల్సిందేనని నిబంధన ఏదీ లేదు. వాటిని తప్పనిసరి చేసేందుకు వీలులేకుండా రాజ్యాంగాన్ని రచించారు. ప్రాథమిక విధులన్నింటినీ తప్పనిసరి చేయలేం. వివిధ రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం, పునరాలోచన ఉంటే దీనిని సవరించవచ్చు. ఇందులో జాతీయ జెండాకు గౌరవం, సామాజిక ఐకమత్యాన్ని చేర్చాలి.
ఇదే రకమైన ఆలోచనను ఆదేశిక సూత్రాలకు వర్తింపజేయలేమా?
చేయొచ్చు.. ఆదేశిక సూత్రాలనేవి మార్గదర్శకాలు. ఆదేశిక సూత్రాల్లోని చాలా అంశాలు చట్టాలుగా మారాయి. మొదట విద్యా హక్కు ఆదేశిక సూత్రాల్లోనే ఉండేది. తర్వాత అది చట్టంగా మారింది. అయితే దీనికి చట్టాల మద్దతు కావాలి. లేదా క్రమబద్ధీకరించేందుకు వీలు ఉండాలి. అప్పుడే వాటిని నిశితంగా పరిశీలించి అమలు చేయగలం.
మీ అభిప్రాయం ప్రకారం భారత రాజ్యాంగానికి అతిపెద్ద సవాలు ఏంటి?
సవాళ్లన్నీ మీ ముందే ఉన్నాయి. అధికరణ 370 రద్దు, సీఏఏ.. ఇవన్నీ ప్రస్తుతం మనం ఎదుర్కొంటోన్న సవాళ్లే. అయితే రాజ్యాంగ ప్రాథమిక సూత్రాల ప్రకారం పార్లమెంటు చట్టాలను చేస్తే భవిష్యత్తులో ఎలాంటి సవాళ్లు ఉండవు. ప్రభుత్వ పరిపాలనకు రాజ్యాంగమే బైబిల్, గీత, ఖురాన్.