మాజీ ప్రధాని దివంగత నేత రాజీవ్ గాంధీపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన విమర్శలపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే కాంగ్రెస్ సహా విపక్ష నేతలు మోదీ వ్యాఖ్యలను ఖండించారు. తాజాగా ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ లేఖ రాసింది.
ప్రధాని ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని, తక్షణం ఆయనపై చర్యలు తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేసింది.
ఖండించిన ప్రియాంక...
తన తండ్రిపై మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి వద్ద నుంచి ఇలాంటి వ్యాఖ్యలు ఊహించలేదన్నారు. దీనికి ప్రజలే సమాధానం చెప్తారని ట్వీట్‌చేశారు.
"ప్రధాని అమరుల పేర్లు చెప్పుకొని ఓట్లు రాబట్టుకోవాలనుకుంటున్నారు. కానీ ఆ అమరులకు మాత్రం గౌరవం ఇవ్వడం లేదు. రాజీవ్‌గాంధీ ఎవరి కోసమైతే తన జీవితాన్ని త్యాగం చేశారో.. ఆ అమేఠీ ప్రజలే మోదీకి బుద్ధి చెప్తారు. నిజం మోదీజీ.. మోసాన్ని ఈ దేశం ఎప్పుడూ క్షమించదు."
- ప్రియాంక గాంధీ ట్వీట్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బోఫోర్స్ కేసు విచారణలో ఉండగానే రాజీవ్‌గాంధీ మరణించారు. మరణానంతరం ఆయనకు క్లీన్ చిట్ లభించింది. ఈ విషయాన్ని ఉద్దేశిస్తూనే ప్రధాని మోదీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
- ఇదీ చూడండి: మరికాసేపట్లో ఐదో విడత ఎన్నికలు ప్రారంభం