సోమవారం నుంచి పార్లమెంట్లో రెండో దఫా బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దిల్లీలో చెలరేగిన సీఏఏ వ్యతిరేక ఘర్షణలపై చర్చకు కాంగ్రెస్ పట్టుబట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. అల్లర్లను నియంత్రించలేనందుకు బాధ్యతగా హోంమంత్రి అమిత్షా రాజీనామాకు డిమాండ్ చేయనున్నట్లు కాంగ్రెస్ లోక్సభాపక్షనేత అధిర్ రంజన్ చౌదరీ వెల్లడించారు. ఈ మేరకు ఉభయసభల్లో కాంగ్రెస్ వాయిదా తీర్మానాలివ్వనుందని తెలిపారు. ఘర్షణలు తలెత్తడానికి గల కారణాలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేయనున్నట్లు స్పష్టం చేశారు.
"శాంతి భద్రతలను పరిరక్షించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. ఆందోళనకారులు, కొంతమంది పోలీసులకు మధ్య ఏదో సంబంధం ఉండటమే అల్లర్లలో మరణాలకు కారణమైంది. ప్రపంచవ్యాప్తంగా భారత్ ప్రతిష్ఠ దెబ్బతిన్నది. ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. సభా వేదికగా హోంమంత్రి అమిత్షా రాజీనామాకు డిమాండ్ చేయనున్నాం."
-అధిర్ రంజన్ చౌదరీ, కాంగ్రెస్ లోక్సభాపక్షనేత
'ప్రజాస్వామ్య విలువలకు విఘాతం'
దిల్లీ ఘర్షణలపై పార్లమెంట్ వేదికగా పోరాడతామన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ. సమస్యను పరిష్కరించడాన్ని ప్రభుత్వం విస్మరించిందన్నారు.
"దిల్లీ అల్లర్లకు సంబంధించి పార్లమెంట్ లోపల, బయట జరిగే ఆందోళనలను ప్రసారం చేయాల్సిన అవసరం లేదు. మాపై చట్టవిరుద్ధమైన వేధింపులు ఉన్నప్పటికీ.. దేశ ప్రజల కోసం ఎలాంటి భయం లేకుండా మా బాధ్యతలను నెరవేరుస్తాం."
-అభిషేక్ సింఘ్వీ, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
42మంది మృతి, మరో 200మందికి గాయాలయ్యేందుకు కారణమైన దిల్లీ ఘర్షణలపై ఇప్పటికే రాష్ట్రపతిని కలిసి హోంమంత్రిని రాజీనామా చేయించాలని విన్నవించింది కాంగ్రెస్. అదే సమయంలో హింసాత్మక ఆందోళనలపై కేంద్రం, దిల్లీ ప్రభుత్వాలు జవాబివ్వాలని కాంగ్రెస్ అత్యున్నత కార్యవర్గమైన సీడబ్ల్యూసీ తీర్మానించింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ వేదికగా మరోసారి దిల్లీ ఘర్షణలపై గళమెత్తనుంది కాంగ్రెస్.
ఇదీ చూడండి: దేశంలోని శరణార్థులందరికీ పౌరసత్వం కల్పిస్తాం: షా