ఉత్తర్ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో రసాభాస జరిగింది. దేవరియా నియోజకవర్గ ఉపఎన్నికకు ముకుంద్ భాస్కర్ మణికి టికెట్ ఇవ్వడంపై తారా యాదవ్ అనే మహిళా కార్యకర్త తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారని నిలదీశారు.
ఈ క్రమంలో సభలో తోపులాట జరిగింది. మహిళపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి సచిన్ నాయక్ సైతం పాల్గొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
"ఓ తప్పుడు వ్యక్తికి పార్టీ టికెట్ ఇచ్చింది. ఇది సమాజంలో పార్టీ ప్రతిష్ఠను పాడు చేస్తుంది. నా అభిప్రాయాన్ని సచిన్ నాయక్తో పంచుకున్నాను. అత్యాచార నిందితుడికి కాకుండా వేరొకరికి టికెట్ ఇవ్వమని చెప్పాను. ఈ మాట చెప్పిన వెంటనే కార్యకర్తలు నాపై దాడి చేశారు. దీనిపై ప్రియాంకా గాంధీ తీసుకొనే చర్యల కోసం ఎదురుచూస్తున్నాను."
-తారా యాదవ్, కాంగ్రెస్ కార్యకర్త
యూపీలోని 7 సీట్లకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.