కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పోటీచేయనున్న రెండో లోక్‌సభ నియోజకవర్గంపై ఊహాగానాలకు తెరపడింది. హస్తం పార్టీ కంచుకోట అయిన కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ బరిలో దిగుతారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ ప్రకటించారు. ఎప్పటిలానే ఉత్తరప్రదేశ్ అమేఠీ నుంచీ రాహుల్ బరిలో ఉండనున్నారు.
కర్ణాటక నుంచి పోటీ చేయాలని రాహుల్ గాంధీని మాజీ సీఎం సిద్ధరామయ్య కొద్దిరోజుల కిందటే కోరారు. తమిళనాడు, కేరళ నేతలు కూడా తమ రాష్ట్రాల నుంచి పోటీ చేస్తారని ఆశించారు. ఉన్నత స్థాయి నాయకుడు పోటీ చేస్తే పార్టీ బలోపేతం అవుతుందన్నదని వారి భావన. కానీ, రాహుల్ రెండో స్థానం గురించి కాంగ్రెస్ పార్టీ చాలా రోజుల నుంచి ఉత్కంఠను కొనసాగించింది.
వయనాడ్‌ను ఎంపికచేయటానికి చాలా అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నాం. కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు కోరుతున్న దృష్ట్యా మిగతా స్థానాల కంటే వయనాడే సరైన స్థానమని నిర్ణయించాం. ఎందుకంటే వయనాడ్ కేరళలో ఉన్నప్పటికీ త్రిముఖ కూడలిగా ఉంది. ఒకవైపు తమిళనాడు సరిహద్దుకు అతిదగ్గర నీలగిరి నియోజకవర్గం తదితర ప్రాంతాలు ఉన్నాయి. కర్ణాటకలో సమీప నియోజకవర్గం చామరాజనగర్ అయినప్పటికీ మొత్తం మైసూర్ ప్రాంతం దీనికి దగ్గరలోనే ఉంటుంది. కేరళలో ఉన్నప్పటికీ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఈ నియోజకవర్గం చుట్టూ ఉంటాయి. కాబట్టే ఈ స్థానాన్ని ఎంచుకున్నాం. - ఏకే ఆంటోనీ, కాంగ్రెస్ సీనియర్ నేత.
అమేఠీలో రాహుల్‌గాంధీ ఓడిపోయే అవకాశం ఉందని, అందుకే దక్షిణాది నుంచి పోటీచేయాలనుకుంటున్నారని భాజపా విమర్శిస్తోంది. దీనిని ఖండించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా. మోదీ కూడా గుజరాత్‌లోని వడోదరతో పాటు వారణాసి నుంచి పోటీచేశారని గుర్తు చేశారు. వడోదరలో గెలుపుపై నమ్మకం లేదా? అని చురకలంటిచారు.