ఉన్నావ్ అత్యాచార బాధితురాలికి నిప్పు పెట్టి హత్య చేసిన ఘటన విషయంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. రాష్ట్రవ్యాప్తంగా నేరస్థులు ఎలాంటి భయం లేకుండా నేరాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితుల ఇళ్లల్లోకి చొరబడి బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు.
ఉన్నావ్ బాధితురాలి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. న్యాయం జరిగే వరకు పోరాడతామని భరోసా కల్పించారు ప్రియాంక. ఉన్నావ్ ఘటన నిందితుల్లో.. కొంత మందికి భాజపాతో సంబంధం ఉన్నట్లు విన్నానని.. అందుకే వారికి రక్షణ కల్పిస్తున్నారని ఆరోపించారు.
" ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లోని అపరాధుల్లో అసలు భయం లేదు. ఏడాది కాలంగా ఉన్నావ్ బాధితురాలి కుటుంబం బెదిరింపులకు గురవుతోంది. ఇంట్లోకి చొరబడి ఆమె తండ్రిపై దాడి చేశారు. పిల్లలను బెదిరించారు. పంటలను తగలబెట్టారు. మహిళలపైనా బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ విధంగా అపరాధం చేశారు. కచ్చితంగా వారిలో భయం అనేదే లేదు. ఈ విధంగా రాష్ట్రంలో అరాచకం ఉత్పన్నమవుతోంది. ఇలాంటి ఘటనలపై ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. ఉత్తర్‌ప్రదేశ్‌లో రోజు రోజుకు మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. దోషులకు ఉత్తర్‌ప్రదేశ్‌లో స్థానం లేదని ముఖ్యమంత్రి అన్నారు. కానీ రాష్ట్రాన్ని ఏ విధంగా మార్చారు. ఇక్కడ మహిళలకు స్థానం ఎక్కడుంది?. "
- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి
ఇదీ చూడండి: 'భాజపా సర్కారు గద్దె దిగితేనే ప్రజలకు న్యాయం'