మధ్యప్రదేశ్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భాజపా మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇద్దరు భాజపా ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతు పలికిన నేపథ్యంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి కమల్నాథ్ ఒక్కరే సింహం అంటూ పేర్కొన్నారు పట్టణ పాలక వ్యవహారాల మంత్రి జయవర్ధన్ సింగ్. డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఓటమి పాలైన క్రమంలో మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ 'పులి ఇంకా బతికే ఉంది' అంటూ వ్యాఖ్యానించటంపై కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్.
జులై 24న అసెంబ్లీలో శిక్షాస్మృతి చట్ట సవరణ బిల్లు -2019కు మద్దతుగా భాజపా ఎమ్మెల్యేలు శరద్ కోల్, నారాయణ్ త్రిపాఠి ఓటు వేశారు. ఈ చర్యతో ప్రతిపక్ష భాజపా ఆశ్యర్యానికి గురయింది. ఆటను కాంగ్రెస్సే ప్రారంభించిందని, కానీ ముగింపు తాము ఇస్తామని భాజపా నేత నరోత్తమ్ మిశ్రా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించారు జయవర్ధన్.
" భాజపా శ్రేణులు కావాలంటే కలలు కనవచ్చు. కానీ మధ్యప్రదేశ్లో తాను ఒక్కరే సింహమని కమల్నాథ్ నిరూపించుకున్నారు. కమల్నాథ్ నాయకత్వంపై నమ్మకంతోనే ఇద్దరు భాజపా ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో కలిసి నడవాలనుకుంటున్నారు. ముఖ్యమంత్రి పనితీరుకు ఆకర్షితులై మాకు మద్దతు పలికారు. "
- జయవర్ధన్ సింగ్, పట్టణ పాలక వ్యవహారాల మంత్రి.
ఇదీ చూడండి: 'చావు బతుకులు లెక్క చేయని జవాన్లే హీరోలు'