రాహుల్ గాంధీ ప్రతిపాదించిన కనీస ఆదాయ పథకంపై భాజపా స్పష్టమైన వైఖరి తెలపాలనికాంగ్రెస్పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా డిమాండ్ చేశారు. ఇప్పటికే చాలా మంది భాజపా మంత్రులు పథకాన్ని వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు.
పేదల కోసం ప్రతిపాదించిన పథకాన్ని మోదీ వ్యతిరేకించడం తగదని సుర్జేవాలా హితవు పలికారు. ఇలాంటి పథకాలు ప్రధానికి గిట్టవని ఆరోపించారు.
"విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మీ సోదరుడు మెహుల్ ఛోక్సీలు లక్ష కోట్ల రూపాయల ప్రజల కష్టార్జితాన్ని తీసుకుని విదేశాలకు పారిపోవచ్చు. కానీ దేశంలోని పేదలకు నెలకు 12 వేల రూపాయలు ఇవ్వడం మీకు ఇష్టం ఉండదు. మీరు 10 లక్షల రూపాయలు విలువ చేసే సూటు వేసుకోవచ్చు. మీరు ధరించే దుస్తులపై 'మోదీ' అని ముద్రించుకుంటారు. దాన్ని నాలుగు 4 కోట్లకు అమ్ముకోవచ్చు. కానీ ఈ దేశంలోని పేదలకు 12వేలు ఇవ్వడానికి ఏమవుతోంది? దీన్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?"
-రణ్‌దీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
అధికారంలోకి వస్తే కనీస ఆదాయ పథకంతో పేదలకు ఏటా రూ. 72వేల రూపాయలు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం ప్రకటించారు.
నీతి ఆయోగ్‌పై..
నీతి ఆయోగ్ ఛైర్మన్ రాజీవ్ కుమార్‌పైనా సుర్జేవాలా తీవ్ర విమర్శలు చేశారు. సంస్థను భాజపా కార్యాలయం నుంచి నడిపించాలని ఎద్దేవా చేశారు. రాజీవ్ కుమార్ భాజపా సభ్యత్వం స్వీకరించి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలని విమర్శించారు.