నీట్, జేఈఈ పరీక్షలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని కేంద్రం ఇప్పటికే తేల్చిచెప్పగా.. కరోనా పరిస్థితుల నేపథ్యంలో వాయిదా వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రానికి లేఖ కూడా రాశారు. అయితే నీట్, జేఈఈ పరీక్షలు యథావిధిగా నిర్వహించడమే సరైన నిర్ణయం అని చెబుతున్నారు విద్యాశాఖ మాజీ కార్యదర్శి అనిల్ స్వరూప్. ఈటీవీ భారత్‌తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. పరీక్షలపై తన అభిప్రాయలను తెలిపారు.
" పరీక్షల నిర్వహణపై వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించాలి. ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్‌లో సరైన దాన్ని ఎంపిక చేసుకోవాలి. అది ఉత్తమంగా ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో కచ్చితమైన పరిష్కారం ఉండదు. అయినప్పటికీ సరైన నిర్ణయం తీసుకోవాలి. పరీక్షలు వాయిదా వేయాలని ఓసారి అనుకుందాం. మళ్లీ ఎప్పుడు జరుగుతాయో తెలియదు. ఒకవేళ కరోనా కట్టడి కాకపోతే పరీక్షలు మొత్తానికే జరగకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో కరోనా జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వహించడమే ఉత్తమమైన నిర్ణయం. లేకపోతే విద్యార్థుల విలువైన ఏడాది కాలం వృథా అవుతుంది. ఇదే సరైన ఎంపిక అని నా అభిప్రాయం. ఆన్లైన్ పరీక్షలు నిర్వహించేందుకు ఇప్పుడు సమయం సరిపోదు. ముందస్తు ఏర్పాట్లు చేయలేదు. అందుకే ఇప్పుడా అవకాశం లేదు."
-అనిల్ స్వరూప్, విద్యాశాఖ మాజీ కార్యదర్శి.