దిల్లీలో జరుగుతున్న హింసాత్మక అల్లర్లపై అమెరికా మతస్వేచ్ఛ కమిషన్ (యూఎస్సీఐఆర్ఎఫ్) చేసిన వాఖ్యలను విదేశీ వ్యవహారాల శాఖ ఖండించింది. కమిషన్ చేసిన వ్యాఖ్యలు తప్పుదోవపట్టించే విధంగా ఉన్నాయని పేర్కొంది. దీనిపై స్పందించిన విదేశాంగ ప్రతినిధి రవీశ్ కుమార్.... అల్లర్లను నియంత్రించి, దిల్లీలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా ప్రభుత్వ యంత్రాంగం క్షేత్రస్థాయిలో పనిచేస్తోందని స్పష్టం చేశారు.
"ఇటీవల దిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలపై అమెరికా మతస్వేచ్ఛ కమిషన్, పలు మీడియా సంస్థలు సహా కొంతమంది వ్యక్తులు చేసిన వ్యాఖ్యలు చూస్తున్నాం. ఇవన్నీ నిజానికి సరికావు, తప్పుదోవపట్టించేలా ఉన్నాయి. అల్లర్లను రాజకీయం చేయడమే ఈ వ్యాఖ్యల లక్ష్యంగా కనిపిస్తోంది." - రవీశ్ కుమార్, విదేశాంగశాఖ అధికార ప్రతినిధి
కమిషన్ ఏమందంటే..!
దిల్లీలో జరుగుతున్న హింస ముస్లింలకు వ్యతిరేకంగా జరుగుతున్నట్లు అమెరికా మతస్వేచ్ఛ కమిషన్ పేర్కొంది. వారి ఇళ్లు, దుకాణాలను ధ్వంసం చేశారని ఆరోపించింది. విశ్వాసాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని తెలిపింది.