బంగాల్ వివాదంలో సుప్రీం తీర్పుపై భాజపా, తృణమూల్ పార్టీలు స్పందించాయి.
బంగాల్ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును అటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ఇటు భాజపా స్వాగతించాయి. ఇరు వర్గాలు నైతిక విజయం మాదంటే మాదని వ్యాఖ్యానించాయి.
పోలీస్ కమిషనర్‌ను అరెస్టు చేయకూడదన్న అత్యున్నత న్యాయస్థాన తీర్పుపై పశ్చిమ్ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హర్షం వ్యక్తం చేశారు. సుప్రీం తీర్పు సామాన్యుల, ప్రజాస్వామ్య, రాజ్యాంగ విజయమని ప్రకటించారు.
"సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. మేం సహకరించబోమని ఎప్పుడూ చెప్పలేదు. ఇదో రాజకీయ కుట్ర. సుప్రీంకోర్టు తీర్పు మా నైతిక విజయం. న్యాయవ్యవస్థపై మాకు అపారమైన గౌరవం ఉంది. ఈ సత్యాగ్రహం కేవలం సీపీ రాజీవ్‌కుమార్ కోసమే కాదు... కోట్లాది భారతీయుల కోసం. రాజకీయ కక్ష్యతోనే కేంద్రం కుట్రతో వ్యవహరిస్తోంది.''
-మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి
ఆదివారం నుంచి కోల్‌కతా మెట్రో ఛానల్ వద్ద సత్యాగ్రహ దీక్ష చేస్తున్నారు మమత. ముఖ్యమంత్రి నిరసనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సహా పలువురు విపక్ష నేతలు మద్దతు ప్రకటించారు.
ఆధారాలు బయటపెట్టాలి: రవి శంకర్
అత్యున్నత న్యాయస్థాన తీర్పును భాజపా స్వాగతించింది. సీపీ రాజీవ్‌కుమార్ దగ్గర ఆధారాలుంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్. సీబీఐ తమ బాధ్యతను నిజాయతీగా నిర్వర్తిస్తోందని సమర్థించారు.
![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)
"అత్యున్నత న్యాయస్థాన తీర్పు... సీబీఐకి నైతిక విజయం. ఈ విచారణ పూర్తయ్యే వరకు వదిలే ప్రసక్తే లేదు. ఈ విషయాన్ని రాజకీయం చేయాలనుకున్న వారికి ఇది ఘోర పరాభవం. దర్యాప్తు జరగడం ఎంతో అవసరం. దర్యాప్తు ఎంతో నిజాయతీగా జరగాలి. సుప్రీంకోర్టు ఆదేశించినట్లుగా... ఈ విషయంలో కుట్ర కోణాన్నీ పరీశీలించాలి. మనీలాండరింగ్ జరిగిందా లేదా అన్నదీ పరిశీలించాలి. నియంత్రణ బోర్డులు తమ బాధ్యతను నిర్వర్తించారా లేదా అన్నదీ పరిశీలించాలి. "
-- రవిశంకర్ ప్రసాద్, న్యాయశాఖ కేంద్ర మంత్రి