కర్ణాటక అధికార కూటమిలో నెలకొన్న సంక్షోభాన్ని గట్టెక్కించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ప్రయత్నాలు వేగవంతం చేశారు. కేబినెట్ విస్తరణ లేదా మంత్రివర్గంలో మార్పులు చేయాలని భావిస్తున్నారు. ఈ విషయంపై చర్చించేందుకు కాంగ్రెస్-జేడీఎస్ కూటమి సమన్వయ కమిటీ చీఫ్ సిద్ధరామయ్యతో శనివారం చర్చలు జరిపారు. మంత్రివర్గం విస్తరణా లేక శాఖల్లో మార్పులు జరుగుతాయా అనే విషయంపై జూన్ 4 తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార కూటమి వర్గాలు తెలిపాయి.
కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం కొనసాగింపుపై సందిగ్ధత నెలకొన్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ నేతలు గత మూడు రోజులుగా అంతర్గత చర్చలు నిర్వహించారు. దిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు కుమార స్వామి.
మంత్రివర్గాన్ని విస్తరించాలా లేక మార్పులు చేయాలా అనే అంశంపై కూటమి నేతల మధ్య మొదట ఏకాభిప్రాయం కుదర్లేదని సమాచారం.
సీఎల్పీ నేత సిద్ధరామయ్య మాత్రం మంత్రివర్గ కూర్పుకే అవకాశాలున్నాయని సంకేతాలిచ్చారు.
కేబినెట్లో ఖాళీగా ఉన్న మూడు స్థానాలను భర్తీ చేసి అవసరమైతే మరికొందరికి అవకాశం దక్కేలా మార్పులు చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి: ఆర్థిక వృద్ధికి నూతన సంస్కరణలు: నీతి ఆయోగ్