దేశ చరిత్రలోనే తొలిసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు భారత ప్రధాన న్యాయమూర్తి. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఎన్ శుక్లాపై కేసు నమోదుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు అనుమతులిచ్చారు. ఓ ప్రైవేటు వైద్య కళాశాల ఎంబీబీఎస్ అడ్మిషన్లలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు శుక్లా.
ఇటీవలే జస్టిస్ శుక్లాపై కేసు నమోదుకు అనుమతించాలని కేంద్ర దర్యాప్తు సంస్థ.. సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయికి లేఖ రాసింది. మాజీ ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా సూచనల మేరకు జస్టిస్ శుక్లా, ఇతరులపై ప్రాథమిక దర్యాప్తు చేపట్టినట్లు లేఖలో పేర్కొంది. సీబీఐ లేఖ, ఇతర పత్రాలు, విచారణ కమిటీ నివేదికను పరిశీలించిన జస్టిస్ రంజన్ గొగొయి... అవినీతి ఆరోపణల్ని తీవ్రంగా పరిగణించాల్సి ఉందని విచారణకు అనుమతించారు.
ఇదీ జరిగింది...
2017లో ఓ మెడికల్ కాలేజీకి అనుమతులు జారీ చేసే విషయంలో శుక్లా.. సుప్రీం కోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారని ఆరోపణలు వచ్చాయి. అందులో భారీ అవినీతికి పాల్పడ్డారని వార్తలొచ్చాయి. ఈ అంశంపై దర్యాప్తునకు అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ఓ కమిటీని ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయి విచారణ జరిపిన కమిటీ.. శుక్లాపై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేల్చింది. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేలా శుక్లా వ్యవహరించారని నివేదికలో స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: సుప్రీం జడ్జీల సంఖ్య పెంపు.. కేబినెట్ నిర్ణయం