పారామిలటరీ బలగాలు దేశ రక్షణ కోసం పనిచేయటం మాత్రమే కాదు ప్రపంచ రికార్డులూ సృష్టించగలవని కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం నిరూపించింది. నోయిడాలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేలో 1,327 సైకిళ్లతో 'ఒకే వరుసలో సైకిల్ పరేడ్' నిర్వహించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది.
రికార్డు సాధించాలంటే రెండు సైకిళ్ల మధ్య దూరం మూడు సైకిళ్ల పొడవుకంటే ఎక్కువ ఉండకూడదు. అందుకు ఎంతో క్రమశిక్షణ అవసరం. జవాన్ల పట్టుదలతో సైకిళ్ల మధ్య సమాన దూరం కొనసాగిస్తూ 3.2 కిలోమీటర్ల మేర పరేడ్ నిర్వహించి రికార్డు సాధించారు. గతంలో హుబ్బళ్లి బైస్కిల్ క్లబ్ 1,235 సైకిళ్లతో సృష్టించిన ప్రపంచ రికార్డును తిరగరాశారు.
గిన్నిస్ వరల్డ్ రికార్డు పత్రాన్ని సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ రంజన్ అందుకున్నారు.