భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) రాజకీయ పార్టీలకు దేశ వృద్ధికి దోహదపడే పలు సూచనలు ఇచ్చింది. వీటిని జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో చేర్చాలని సభ్యుల సమావేశం తర్వాత ప్రకటన విడుదల చేసింది. రానున్న ఐదేళ్లలో దేశం ఆర్థిక వృద్ధిని సాధించాలంటే ఈ సూచనలు పరిగణలోకి తీసుకుంటే ఫలితం ఉంటుందని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ ఆశాభావం వ్యక్తం చేశారు.
సీఐఐ సూచనలు ఇవే:
1.రానున్న ఐదేళ్లలో 8 శాతం వృద్ధి సాధించేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి.
2.వ్యవసాయ రంగ అభివృద్ధికి 'జాతీయ సమగ్ర వ్యవసాయ కమిషన్'ను తీసుకురావాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా దీన్ని నిర్వహించాలి. రాష్ట్రాలకు 'ఈజ్ ఆఫ్ డూయింగ్' కింద ర్యాంకింగ్‌లు ప్రకటించాలి.
3.జీఎస్స్టీని 2 నుంచి 3 స్లాబులకు కుదించాలి. కార్పొరేట్ పన్నులను 18 శాతానికి తగ్గించాలి.
4.న్యాయ, పోలిస్ విభాగాల్లో సంస్కరణలు తీసుకురావాలి.
5. విద్యా రంగంపై 6 శాతం ప్రజాధనం వ్యయాన్ని పెంచాలి. నైపుణ్య శిక్షణను పాఠశాలల్లో ప్రవేశ పెట్టాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి.
6.విశ్వవిద్యాలయాలకు, పరిశ్రమలకు పరిశోధన, అభివృద్ధికి ప్రస్తుతం కేటాయిస్తోన్న మూలధన సాయాన్ని 1 శాతం మేర పెంచాలి.
7.ఆరోగ్య రంగంలో వ్యయాలు 3 శాతం మేర పెంచాలి.
8. కార్మిక చట్టాలు సంస్కరించాలి.