అయోధ్య భూవివాదం కేసు ఫిర్యాదుదారుల్లో ఒకరైన గోపాల్ సింగ్ విశారద్ తాజాగా వేసిన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. మధ్యవర్తిత్వ కమిటీ పనితీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించనుంది.
ఆయన వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం.. అందుకు సంబంధించిన వివరాలను సమర్పించాలని సూచించింది.
రామమందిర వ్యవహారంలో మధ్యవర్తిత్వ కమిటీని నియమించిన తర్వాత రెండో సారి కేసు విచారణకు రానుంది. మధ్యవర్తిత్వ కమిటీ నివేదికను మే నెలలోనే సమర్పించాల్సి ఉన్నా ఆగస్టు 15 వరకూ గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది న్యాయస్థానం.
ఇదీ నేపథ్యం
అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్ బోర్డ్, నిర్మోహి అఖాడా, రామ్ లల్లాకు సమానంగా పంచాలని 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పునకు వ్యతిరేకంగా ఇప్పటివరకు సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి.
ఈ వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు మార్చి 8న కీలక నిర్ణయం తీసుకుంది. వివాద శాశ్వత పరిష్కారానికి మధ్యవర్తిత్వమే మార్గమని తీర్మానించింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఖలీఫుల్లా ఛైర్మన్‌గా మధ్యవర్తిత్వ ప్యానెల్ ఏర్పాటుచేసింది. ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచును సభ్యులుగా నియమిస్తూ జస్టిస్ రంజన్‌గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. నివేదిక సమర్పించేందుకు ప్యానెల్‌కు 8 వారాల గడువు ఇచ్చింది.
జస్టిస్ ఖలీఫుల్లా నేతృత్వంలోని ప్యానెల్... ఉత్తర్‌ప్రదేశ్ ఫైజాబాద్ వేదికగా భాగస్వామ్యపక్షాలతో సమాలోచనలు జరిపింది. మొదటి దఫాలో జరిగిన చర్చల సారాంశాన్ని నివేదిక రూపంలో మే నెలలో సుప్రీంకోర్టుకు అందజేసింది. ప్యానెల్ అభ్యర్థన మేరకు మధ్యవర్తిత్వానికి గడువును ఆగస్టు వరకు పెంచింది సుప్రీంకోర్టు.
ఇదీ చూడండి: అయోధ్య కేసుపై సత్వర విచారణకు అభ్యర్థన