ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బాలో 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అడ్డొచ్చిన ఆమె తండ్రి(55), అతడితో పాటే ఉన్న మనవరాలు(04)నూ పొట్టనపెట్టుకున్నారు ఆ దుండగులు. జనవరి 29న జరిగిన ఈ కేసులో.. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు.
ఇదీ జరిగింది..
కోర్బా జిల్లా లెమ్రూ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 29న బాధితురాలు, ఆమె తండ్రి, అతడి మనవరాలు బయటకు వెళ్లారు. సాయంత్రమైనా తిరిగి రాలేదు. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు.. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. అనుమానంతో సంత్రం మఝ్వర్ అనే వ్యక్తిని పట్టుకుని విచారించగా.. అసలు విషయం బయటపడింది. ఈ కేసుకు సంబంధించి మొత్తం ఆరుగురు నిందితుల(సంత్రం మఝ్వర్(45), అబ్దుల్ జబ్బార్(29), అనిల్ కుమార్ సార్థి(20), పర్దేశీ రామ్ పణికా(35), ఆనంద్ రామ్ పణికా(25), ఉమాశంకర్ యాదవ్(21))ను అరెస్ట్ చేసినట్టు స్థానిక పోలీసులు తెలిపారు.
బాలిక తండ్రి.. సంత్రం మంఝ్వర్ వద్ద గతేడాది జులై నుంచి పశువుల కాపరిగా పని చేస్తున్నాడు. గత శుక్రవారం(జనవరి 29న) మంఝ్వర్.. తన మోటార్‌సైకిల్‌పై బాలిక, తండ్రి, మనవరాలిని వదిలేందుకు బయల్దేరాడు. ఇంతలో మద్యం సేవించేందుకు దారిలో ఆగాడు మంఝ్వర్. అక్కడ అతడికి మరో ఇద్దరు నిందితులు జత కలిశారు. ఈ ముగ్గురూ కలిసి బాధితులను అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి.. మరో ముగ్గురితో కలిసి మైనర్‌పై అత్యాచారం చేశారు. అడ్డొచ్చిన తండ్రి, చిన్నారిపై కూడా రాళ్లు, కర్రలతో దాడిచేశారు. ఈ ఘటనలో తండ్రి, మనవరాలు అక్కడిక్కడే మరణించారు. తీవ్ర గాయాలైన ఆ బాలిక.. నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయింది.
నిందితులపై భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ) సెక్షన్-302(హత్య), 376(2)జీ(సామూహిక అత్యాచారం), ఎస్టీ యాక్ట్, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: అక్కడ పెళ్లి జరగాలంటే ఆధార్ ఉండాల్సిందే!