దక్షిణ భారతదేశంలో కొరియా భాషను వ్యాప్తి చేయడానికి గత 14 ఏళ్లుగా కృషి చేస్తున్నందుకు గాను.. చెన్నైకి చెందిన ఐఎన్కేఓ సెంటర్ డెరెక్టర్ రతి జాఫర్‌కు తమ దేశ అత్యున్నత పురస్కారం అందించాలని నిర్ణయించింది దక్షిణ కొరియా ప్రభుత్వం. ఈ మేరకు కొరియా 'ప్రధానమంత్రి పతకం' అందించనున్నట్లు ఓ ప్రకటన చేసింది చెన్నైలోని దక్షిణ కొరియా రాయబార కార్యాలయం. ఈ మేరకు సదరు యువతిని సంప్రదించినట్లు తెలిపింది.
'ఐఎన్కేఓ కేంద్రాన్ని 2006లో టీవీఎస్, హ్యూందయ్ మోటర్స్ సాయంతో నెలకొల్పాం. థియోటర్ ఆర్ట్స్, నృత్యం, సంగీతం, చిత్ర కళతో సహా ఇతర కళల్లో ఈ సంస్థ శిక్షణ ఇస్తోంది. ఈ పురస్కారం ప్రస్తుతం నాకు, ముఖ్యంగా దక్షిణ భారత్‌లో కొరియా భాష అభివృద్ధికి అందిన గౌరవం. ' అని రతి జాఫర్ పేర్కొన్నట్లు కొరియా రాయబార కార్యాలయ అధికారులు పేర్కొన్నారు.
కొరియా నేర్చుకోవాలనుకుంటున్న వారికి మాతృ భాష కొరియా కలిగిన ఉపాధ్యాయులతోనే నేర్పిస్తున్నట్లు తెలిపారు జాఫర్. చెన్నైలోని కొరియా సంస్థల్లో పని చేస్తున్న వారికి, ఉన్నత చదువుల కోసం కొరియా వెళ్లాలనుకునే విద్యార్థులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రస్తుతం తమిళనాడులోని ఇతర జిల్లాల వారికి ఈ-లర్నింగ్ ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. చెన్నైలోని శ్రీపెరుంబదుర్ ప్రాంతంలో సుమారు 300లకుపైగా కొరియన్ కంపెనీలు ఉన్నాయి. ఆయా సంస్థల్లో పని చేస్తున్న వారి కోసం ప్రత్యేక పాఠ్యాంశాలను రూపొందించినట్లు తెలిపారు. కొరియా సంస్థల్లో పని చేస్తున్నవారికి ఇది మరింత ఉపయోగపడుతుందన్నారు. వారితో పాటు చాలా మంది ఈ భాష నేర్చుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నట్లు తెలిపారు.
దక్షిణ కొరియా ప్రధానమంత్రి తరఫున.. చెన్నైలోని కొరియా రాయబార కార్యాలయ అధికారి యంగ్ సియోఫ్ కువాన్ నవంబర్ 18న రతి జాఫర్‌కు ఈ పురస్కారాన్ని అందించనున్నారు.
ఇదీ చూడండి:యూత్ ఐకాన్: ఈ బాలికకు 13 మంది శిష్యులు